అదానీ హిండెన్ బర్గ్ వివాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. తప్పు ఎవరు చేసినా వదిలిపెట్టేది లేదన్నారు. న్యాయ వ్యవస్థ ప్రక్రియపై అందరికీ నమ్మకం ఉండాలన్నారు. నిరాధారమైన ఆరోపణలను చేయకూడదని, అవి ఎంతో కాలం నిలబడవని చెప్పారు. ఓ జాతీయ ఛానల్ నిర్వహించిన కాంక్లెవ్ లో ఆయన మాట్లాడారు. ఈ వివాదంపై సుప్రీంకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు, రుజువులు ఉన్నవారు ఈ కమిటీకి సమర్పించాలని చెప్పారు.
అదానీ వివాదంపై దర్యాప్తు జరుపుతున్నట్లు సెబీ అఫిడవిట్ ద్వారా సుప్రీంకోర్టుకు తెలిపిందన్నారు. ఈ దర్యాప్తును కొనసాగించాలని సెబీని సుప్రీంకోర్టు ఆదేశించిందన్నారు. ఏక కాలంలో రెండు దర్యాప్తులు జరుగుతున్నాయన్నారు. కోర్టుకు వెళ్లకుండా బయట విపక్ష నేతలు ఎందుకు నానా హంగామా చేస్తున్నారు? అంటూ అమిత్ షా ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పదేళ్ల పాలనలో ₹ 12 లక్షల కోట్ల కుంభకోణాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చినప్పుడు, పరిస్థితిని ప్రశాంతంగా ఉంచడానికి ప్రభుత్వం సీబీఐ ద్వారా కేసు నమోదు చేసిందని అమిత్ షా గుర్తు చేశారు.