తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగానే ముగిశాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకూ కొనసాగింది. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్ నగర్ జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మధ్యాహ్నం 2 గంటల వరకూ 75 శాతం పోలింగ్ నమోదైంది. ఈ నెల 16 న కౌంటింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల వరకూ మహబూబ్ నగర్ జిల్లాలో 64 శాతం, నాగర్ కర్నూలు జిల్లాలో 81 శాతం, వనపర్తి జిల్లాలో 74, గద్వాలలో 88, నారాయణపేటలో 81, రంగారెడ్డిలో 65, వికారాబాద్ లో 79, మల్కాజిగిరి 68, హైదరాబాద్ లో 68 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు పేర్కొన్నారు. అయితే… సాయంత్రం 4 గంటల తర్వాత ఎంత నమోదైందో ఇంకా తెలియలేదు. మొత్తం 29,720 ఓటర్లు వున్నారు. ఇందుకు గాను 137 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు.
ఇక.. ఏపీలోనూ చెదురు ముదురు సంఘటనలు మినహా… పోలింగ్ ప్రశాంతంగానే ముగిసింది. 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్, 4 స్థానిక సంస్థలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. 16న ఓట్ల లెక్కింపు జరగనుంది. గుంటూరు, కడప, ఒంగోలులో స్వల్ప ఉద్రిక్తతలు తప్పించి, ప్రశాంతంగానే ముగిసింది. కడప, అనంతపురం, కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4 గంటల వరకూ 60.88 శాతం పోలింగ్ జరిగింది. కడప, అనంతపురం, కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 85.24 శాతం పోలింగ్ నమోదైంది.