ఏపీ అసెంబ్లీ నేడు రెండు కీలక తీర్మానాలకు ఆమోదం తెలిపింది. ఈ రెండు తీర్మానాలనూ తాము కేంద్రానికి పంపుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు. ఆ రెండు తీర్మానాలలో మొదటిది బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చాలన్నది ఓ తీర్మానం. దీనిని బీసీ సంక్షేమ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణ సభలో ప్రవేశపెట్టారు. ఇక.. రెండోది క్రిస్టియన్లుగా మారిన దళితులను ఎస్సీలుగా పరిగణించాలన్నది మరో తీర్మానం. దీనిని సాంఘిక సంక్షేమ మంత్రి మేరుగ నాగార్జున ప్రవేశపెట్టారు. ఈ రెండు తీర్మానాలు కూడా ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ… తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో తమను ఎస్టీల్లో చేర్చాలని బోయ, వాల్మీకి వాళ్లు కోరారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే వారి స్థితిగతులపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశామని, ఆ కమిషన్ తమకు నివేదిక సమర్పించిందని పేర్కొన్నారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే తీర్మానం చేవామని వివరించారు. అయితే.. ఏజెన్సీలో వున్న ఎస్టీ కులాలపై దీని ప్రభావం ఏమాత్రం వుందని తేల్చి చెప్పారు. అలాగే దళిత క్రిస్టియన్లను ఎస్సీల జాబితాలో చేర్చాలని, ఉమ్మడి ఏపీలో వైఎస్సార్ హయాంలో తీర్మానం జరిగిందని, మళ్లీ ఇప్పుడు తీర్మానం చేస్తున్నామని పేర్కొన్నారు.