విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ సమ్మిట్ పై టీడీపీ యువ నేత నారా లోకేశ్ విమర్శలు చేశారు. ఇప్పటికే ఒప్పందాలు జరిగిన కంపెనీలతో ప్రభుత్వం మళ్లీ ఎంవోయూలు కుదుర్చుకుందని లోకేశ్ ఆరోపించారు. ఇలా చేయడం ద్వారా ప్రజలను వైసీపీ మోసం చేస్తోందని మండిపడ్డారు. ఏపీలో ప్రభుత్వ టెర్రరిజం నడుస్తోందన్న విషయాన్ని పారిశ్రామికవేత్తలే పేర్కొంటున్నారని, ప్రముఖ కంపెనీలు బైబై ఏపీ అంటున్నాయని లోకేశ్ ఎద్దేవా చేశారు.
దావోస్ ఒప్పందాలను మళ్లీ విశాఖలోని గ్లోబల్ సమ్మిట్ లో చేసురకున్నట్లు చూపించారని సంచలన ఆరోపణలు చేశారు. విశాఖలో జరిగింది గ్లోబల్ సమ్మిట్ కాదు.. లోకల్ ఫేక్ సమ్మిట్ అని అన్నారు. ఏబీసీ కంపెనీ టర్నోవర్ రూ.120 కోట్లు అని.. అలా కంపెనీ లక్షా 20 వేల కోట్ల పెట్టుబడి ఎలా పెడుతుందని ప్రశ్నించారు. రూ.లక్ష కేపిటల్ ఉన్న ఓ కంపెనీ రూ.76వేల కోట్లు పెట్టుబడి పెడుతుందా అంటూ పీఏలు రద్దు చేయొద్దని కేంద్రం హెచ్చరించినా జగన్ పట్టించుకోలేదని యువనేత ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు టీడీపీ అధికారంలోకి వస్తే ఇప్పుడున్న పథకాలు రద్దు చేస్తారన్న ప్రచారంలో నిజం లేదన్నారు. చంద్రబాబు పాలనలో గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలు దేన్నీ రద్దు చేయలేదని.. రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీని ప్రారంభించారని.. తాము కొనసాగించామన్నారు. కానీ జగన్ మాత్రం టీడీపీ హయాంలో అమలు చేసిన పథకాలను పూర్తిగా రద్దు చేశారని ధ్వజమెత్తారు. 100 సంక్షేమాలు కట్ చేసిన ప్రభుత్వం ఇది.. దానిపై చర్చకు తాను సిద్ధమన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేదని.. తాము అధికారంలోకి వచ్చాక సచివాలయ ఉద్యోగులను కొనసాగిస్తామని క్లారిటీ ఇచ్చారు.