ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 2 స్థానాలను ప్రతిపక్ష టీడీపీ కైవసం చేసుకోవడంతో ఉత్కంఠత నెలకొంది. దీంతో టీడీపీ కేడర్ లో జోష్ మరింతగా పెరిగింది. వైసీపీ హవా కొనసాగుతున్న సమయంలో కూడా ఆ హవాను కాదని, టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో వైసీపీలో కొంత షాక్ వాతావరణం నెలకొంది. ఇది కొనసాగుతుండగానే.. పశ్చిమ రాయలసీమలో మాత్రం వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ప్రతి రౌండ్ లోనూ టీడీపీ, వైసీపీ మధ్య నువ్వా నేనా అన్నట్లుగానే సాగుతోంది.
11 రౌండ్లలో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తైంది. కాగా… మొత్తం 2,45,687 ఓట్లు పోలైనట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో 2,26,448 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. తొలి ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపులో ఎవరికీ మెజారిటీ రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును చేస్తున్నారు. అయితే… ఇప్పటి వరకూ వైసీపీ అభ్యర్థికి 96,340 ఓట్లు రాగా, టీడీపీకి 94,606 ఓట్లు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో వైసీపీ అభ్యర్థి ముందు వరుసలో కొనసాగుతున్నారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ సత్తా చాటింది. తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్ర స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో పట్టభద్రుల్లో టీడీపీ తన పట్టును నిలుపుకుంది. టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి విజయం సాధించారు. ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనంతరం ఆయన గెలుపును అధికారులు ప్రకటించారు. దీంతో ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 94,510 మ్యాజిక్ ఫిగర్ సాధించారు.
మరోవైపు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తెలుగు దేశం పార్టీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ ఘన విజయం సాధించారు. ఈ క్రమంలో కంచర్ల శ్రీకాంత్ విజయంపై తెలుగు దేశం పార్టీ ట్వీట్ చేసింది. ‘‘టీడీపీ బలపరిచిన తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రరెడ్డి 1,943 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మూడు రౌండ్లలో రవీంద్రరెడ్డికి 28,872 ఓట్లు రాగా.. తెలుగు దేశం పార్టీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డికి 26,929 ఓట్లు పడ్డాయి.