పాకిస్తాన్ ఏజెంట్లకు సిమ్ కార్డులు సరఫరా చేస్తున్న ఐదుగురిని అసోం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఐదుగురూ నాగావ్, మోరిగావ్ జిల్లాలకు చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు. వారి నుంచి మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే… ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చిన పక్కా సమాచారంతో అసోం పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు.
ఈ ఐదుగురూ 10 మంది సర్వీస్ ప్రొవైడర్ల నుంచి మోసపూరితంగా సిమ్ కార్డులను సేకరించి, కొంత మంది పాకిస్తానీ ఏజెంట్లకు సరఫరా చేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఇలా సరఫరా చేయడం ద్వారా దేశ సమగ్రత, సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని పోలీసులు వివరించారు. అషికుల్ ఇస్లాం, బోడోర్ ఉద్దీన్, మిజానూర్ రెహ్మాన్, వహిదుజ్ జమాన్, బహరుల్ ఇస్లామ్ అరెస్టైన జాబితాలో వున్నారు. వీరి నుంచి 18 ఫోన్లు, 136 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.