జగనన్న గోరుముద్ద ద్వారా బడి పిల్లలకు వారానికి మూడు రోజులు రాగి జావ అందించే కార్యక్రమాన్ని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. పౌష్టికాహారంతోనే ఆరోగ్యం, చక్కటి విద్యాభ్యాసం సాధ్యమని నమ్ముతూ ఒక మేనమామగా మధ్యాహ్న భోజన కార్యక్రమం “గోరుముద్ద”లో భాగంగా ఇవ్వాళ్టి నుంచి రాగిజావ అందిస్తున్నాం. గుడ్డు, చిక్కీసహా అందిస్తున్న 15 ఆహార పదార్థాలకు ఇది అదనం. భాగస్వామి అయిన సత్యసాయి ట్రస్టుకు నా ధన్యవాదాలు. అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ పధకం కోసం జగన్ సర్కార్ 1,910 కోట్లను వెచ్చిస్తూ పిల్లలకు పౌష్టికాహారాన్ని సరఫరా చేస్తోంది.
పౌష్టికాహారంతోనే ఆరోగ్యం, చక్కటి విద్యాభ్యాసం సాధ్యమని నమ్ముతూ ఒక మేనమామగా మధ్యాహ్న భోజన కార్యక్రమం “గోరుముద్ద”లో భాగంగా ఇవ్వాళ్టి నుంచి రాగిజావ అందిస్తున్నాం. గుడ్డు, చిక్కీసహా అందిస్తున్న 15 ఆహార పదార్థాలకు ఇది అదనం. భాగస్వామి అయిన సత్యసాయి ట్రస్టుకు నా ధన్యవాదాలు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 21, 2023
ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్యను పెంచడం, సదుపాయాలను మెరుగుపరిచే విషయంలో ఆలోచించి, అనేక చర్యలు చేపట్టామన్నారు. గర్భవతులైన మహిళల నుంచి, చిన్నారుల వరకూ వచ్చే వరకూ సంపూర్ణ పోషణ ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు. అమ్మ ఒడి, విద్యాకానుక అమలు చేస్తున్నామని, పై చదువుల్లో కూడా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వివరించారు.
పిల్లల అందర్నీ కూడా భావి ప్రపంచంతో పోటీపడేలా, వారు గెలిచేలా ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందని ప్రకటించారు. గోరుముద్ద కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా అమలు చేసేలా అడుగులు వేస్తున్నామని, నేటి నుంచి రాగిజావ కూడా పిల్లలకు అందిస్తామని ప్రకటించారు. పిల్లలకు ఐరన్ కానీ, కాల్షియం కానీ పెరగడానికి ఈ ఆహారం ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. 1 నుంచి 10 తరగతి పిల్లలకు దాదాపు 38 లక్షల మందికి పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు.