టీపీసీసీ చీఫ్ రేవంత్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ విరుచుకుపడ్డారు. పీసీసీ హోదాలో వుంటూ అసభ్యకరమైన పదాలు వాడుతున్నారని, అదేం భాష అంటూ విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ఇలాంటి భాష మాట్లాడతారా? అంటూ ప్రశ్నించారు. ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరమని అన్నారు. తమ ఇద్దరి అన్నాదమ్ముల్లపై కాంగ్రెస్ నేతలు మాట్లాడిన భాషను ప్రజలందరూ గమనించారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పదవికి తన అన్న వెంకట్ రెడ్డి రాజీనామా చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ లో తమకు ఎవ్వరూ ప్రాధాన్యం ఇవ్వడం లేదని, కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి రేవంత్ ను సీఎం చేయాలా? అంటూ ప్రశ్నించారు. పార్టీలో ఎందరో సీనియర్ల వున్నారని, వారందర్నీ కాదని రేవంత్ కు పీసీసీ ఎలా వచ్చిందంటూ ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో తమ పార్టీ సీఎల్నీకి నేతకు పూర్తిగా సహకరించానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి అన్నారు. మూడున్నర సంవత్సరాలుగా మునుగోడు ప్రజల కోసం పనిచేశానని అన్నారు. ప్రజాస్వామ్యంలో పార్టీలు మారే హక్కు అందరికీ వుంటుందని, స్వేచ్ఛ తనకు కూడా వుందన్నారు. ఓ పార్టీ గుర్తుపై గెలిచి, మరో పార్టీలోకి వెళ్లడం లేదని, ప్రజాస్వామ్య బద్ధంగానే రాజీనామా చేసి, బీజేపీలోకి వెళ్తున్నానని స్పష్టం చేవారు.