బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. పదో తరగతి పేపర్ లీకేజీకి పాల్పడి బండి సంజయ్, బీజేపీ పార్టీ అడ్డంగా దొరికిపోయిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. పేపర్ లీకేజీ వెనుక ఉన్న సూత్రధారి బీజేపీకి కరుడు కట్టిన కార్యకర్త, బండి సంజయ్‌కు ముఖ్య అనుచరుడు అని తెలిపారు. పేపర్ లీకేజీకి పాల్పడిన ప్రశాంత్ మీ పార్టీ కార్యకర్త కాకపోతే అతన్ని విడుదల చేయాలని ఎందుకు డిమాండ్ చేశారని బీజేపీని ప్రశ్నించారు. బీజేపీవి దిగజారుడు రాజకీయాలని, అధికారం కోసం ఏదైనా చేసేందుకు సిద్ధంగా వుంటారని విమర్శించారు. పిల్లల భవిష్యత్ తో ఆటలాడుతారా? అంటూ హరీశ్ ప్రశ్నించారు. దమ్ముంటే రాజకీయంగా కొట్లాడాలని సవాల్ విసిరారు. పట్టపగలే స్పష్టంగా దొరికిన దొంగ బండి సంజయ్ అని హరీశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ నాయకులకు చదువు విలువ తెలియదని, బీజేపీలో చదువుకున్నోళ్లు తక్కువ ఉన్నారని రాష్ట్రం నుంచి కేంద్రం దాకా అంతా ఫేక్ సర్టిఫికెట్లే వీళ్లవి. ఈ పేపర్ లీకేజీ వెనుక సూత్రధారి, పాత్రధారి అంతా ప్రత్యక్షంగా, పరోక్షంగా బండి సంజయ్ ఉన్నాడని ఆరోపించారు. ఈడీ, సీబీఐ, ఐటీ నోటీసులిచ్చి కుట్రలు పన్నారని, చివరకు ప్రశ్నపత్రాలు లీకేజీతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. దిగజారి కుట్రలతో పేపర్ లీకవుతుందని ప్రజల్లో గందరగోళం సృష్టించాలని దివాళా, దిక్కుమాలిన రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
వాట్సాప్ ప్రశ్నపత్రం పెట్టిన నిందితుడు ప్రశాంత్ బీజేపీ కార్యకర్త అవునా? కాదా? అని హరీశ్ ప్రశ్నించారు. అతడు ప్రశ్నపత్రం పంపించింది నిజమా? కాదా? రోజుకో పేపర్ లీకేజీ పేరుతో బీజేపీ కుట్రలు పన్నిన మాట వాస్తవమా? కాదా? అని ప్రశ్నించారు. ప్రశాంత్ 2 గంటల్లో 142 సార్లు ఫోన్ లో మాట్లాడారని, అందులో భాగంగా సంజయ్ కి కూడా ఫోన్ చేశాడని, ఇది నిజం కాదా? అని మంత్రి హరీశ్ ప్రశ్నించారు.