విదేశీ గడ్డపై భారత్ ను అపహాస్యం చేసి మాట్లాడరంటూ కాంగ్రెస్ నేత రాహుల్ పై బీజేపీ తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఆయన పార్లమెంట్ వేదికగా క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ గురువారం పార్లమెంట్ కి వచ్చారు. ఈ వివాదంపై స్పందించేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరగా…. ఇది అడిగిన కాసేపటికే సభ వాయిదా పడింది. దీంతో రాహుల్ గాంధీ మీడియా సమావేశం నిర్వహించారు. ఇప్పుడు చూస్తోంది ప్రజాస్వామ్యానికి పరీక్షా కాలమని అభివర్ణించారు.
తనపై ఆరోపణలు చేస్తున్న మంత్రులకు సమయం ఇచ్చినట్లే.. సభలో మాట్లాడేందుకు ఓ ఎంపీకి అవకాశం దక్కుతుందా? వారు తనను మాట్లాడనిస్తారని తాను భావించడం లేదని రాహుల్ పేర్కొన్నారు. సభలో మాట్లాడేందుకు తనకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ ను కోరానని వెల్లడించారు. అయితే.. తనకు ఆయన హామీ ఇవ్వలేదని, చిరు నవ్వు నవ్వారని రాహుల్ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ప్రముఖ వ్యాపారవేత్త అదానీ మధ్య ఉన్న సంబంధాలేంటని ప్రశ్నించారు. తాను ప్రశ్నలు మాత్రమే లేవనెత్తానని, సమాధానం చెప్పాల్సిన కేంద్ర ప్రభుత్వం ఎందుకు తప్పించుకుంటోందని ప్రశ్నించారు. అదానీ విషయంలో కేంద్రం ఎందుకు మౌనం వహిస్తుందని ప్రశ్నించారు.