కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు స్పందించారు. అగ్నిపథ్ స్కీం యువతకు బంగారం లాంటి అవకాశమని రాజ్ నాథ్ అన్నారు. త్వరలోనే అగ్నిపథ్ నియామకాల ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించారు. అందుకు యువత సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
గత రెండేళ్లలో నియామకాలు చేపట్టని కారణంగా సైన్యంలో చేరాలనుకున్న వారికి అవకాశం లభించలేదని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అగ్నివీరుల నియామకానికి ఈ యేడాది మాత్రమే వయో పరిమితిని పెంచామని, ఈ మినహాయింపు మరల మరలా వుండదని రాజ్ నాథ్ తేల్చి చెప్పారు. ఈ యేడాది వయో పరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు పెంచామని రాజ్ నాథ్ ప్రకటించారు.
ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా స్పందించారు. యువకుల భవిష్యత్తు కారణంగానే వయోపరిమితిని పెంచామని పేర్కొన్నారు. ఉజ్వల భవిష్యత్తు నిర్మాణం చేసుకోవాలనుకున్న యువతకు మంచి అవకాశమని అన్నారు. ఇక భారత ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే కూడా స్పందించారు. వయో పరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు పెంచామని, ఇది యువతకు గొప్ప అవకాశమని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ నిర్ణయం ఆర్మీకి చేరిందని, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. భారత సైన్యంలో చేరాలనుకున్న వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనోజ్ పాండే కోరారు.