ఓవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విచారణ జరుగుతుండగానే… హైదరాబాద్ వేదికగా బీఆర్ఎస్ ఆందోళన చేస్తోంది. లిక్కర్ స్కాం కేసు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిన్న చేపట్టిన దీక్షలో భాగంగా మాట్లాడిన బండి సంజయ్.. కవిత అరెస్టుకు సంబంధించి ఇబ్బందికర వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బండి సంజయ్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రోడ్డెక్కారు. బీఆర్ఎస్ పార్టీలోని మహిళా నేతలంతా నిరసనలో పాల్గొంటూ.. బండి సంజయ్ దిష్టి బొమ్మలను దహానం చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లోనూ బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.
మరోవైపు బండి సంజయ్ కి రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. బండి సంజయ్ కామెంట్స్ పై కమిషన్ సీరియస్ అయ్యింది. బండి సంజయ్ కి నోటీసులు జారీ చేస్తున్నట్లు మహిళా కమిషన్ ప్రకటించింది. బండి వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని, డీజీపీ విచారణ చేయాలని ఆదేశించింది. బండి సంజయ్ వ్యక్తిగతంగా హాజరు కావాలని మహిళా కమిషన్ ఆదేశించింది.