TSPSC పేపర్ లీక్ కేసు విషయంలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి సిట్ అధికారులు నోటీసులిచ్చారు. పేపర్ లీకేజీ విషయంలో ఆయన వద్ద వున్న ఆధారాలను సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నెల 24 న తమ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆదేశాలిచ్చారు. అయితే… బండి సంజయ్ తన నివాసంలో అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇంటి గోడకు నోటీసులు అతికించారు. ఆయన ఆరోపణలకు తగిన ఆధారాలు, ఇతర వివరాలు ఏవైనా ఉంటే దర్యాప్తు బృందానికి ఇవ్వాలని సిట్ అధికారులు స్పష్టం చేశారు. ఒకే గ్రామంలో ఎక్కువ మందికి ర్యాంకులు వచ్చాయని ఆరోపించారు. అంతేకాకుండా కేటీఆర్ పాత్ర వుందంటూ ఆరోపించారు.
అయితే.. పేపర్ లీకేజీ కుట్రలో తన పాత్ర వుందంటూ కేటీఆర్ ఆరోపిస్తున్నారని, ఆ ఆధారాలు సమర్పించాలని నోటీసులిచ్చే దమ్ము సిట్ కి వుందా? అంటూ బండి సంజయ్ సవాల్ విసిరారు. తనపై చేస్తున్న ఆరోపణలకు సంబంధించి కేటీఆర్ ను పిలిచి విచారించే ధైర్యముందా? అంటూ ప్రశ్నించారు. ఈ లీకేజీ కేసులో సిట్ నోటీసుల పేరుతో ప్రతిపక్ష పార్టీల నేత నోరు నొక్కేసే కుట్ర చేస్తోందని మండిపడ్డారు.