TSPSC పేపర్ లీకేజీ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు మరోసారి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నివాసానికి వెళ్లారు. పేపర్ లీకేజీ కేసులో ఆధారాలు ఇవ్వాలని మరోసారి ఆయనకు నోటీసులు అందజేశారు. ఆదివారం తమ మందుకు విచారణకు హాజరు కావాలని తెలిపారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర మహా ధర్నాకు వెళ్లబోతున్న సమయంలోనే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కు మరోసారి నోటీసులు ఇచ్చింది సిట్.
బండి సంజయ్ కు 91 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. తమ వద్ద ఉన్న ఆధారాలను సమర్పించాలని నోటీసులో అధికారులు తెలిపారు. అసలు తనకు సిట్ నోటీసులు అందలేదని, ఏ ఇంటికి సిట్ నోటీసులు అంటించిందో తెలియదంటూ సంజయ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు బండి సంజయ్ కి నోటీసులిచ్చారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సిట్ అధికారులకు లేఖ రాశారు. తనకు సిట్ నోటీసులు అందలేదని అందులో పేర్కొన్నారు. మీడియా ద్వారా తెలిసిన సమాచారం మేరకే తాను స్పందిస్తున్నానని పేర్కొన్నారు. 24 న విచారణకు హాజరు కావాలని మీడియా ద్వారా తెలిసిందన్నారు. అయితే.. పార్లమెంట్ సభ్యుడిగా తాను సమావేశాలకు హాజరు కావాల్సి వుందని పేర్కొన్నారు. అందుకే 24 న విచారణకు రాలేనని పేర్కొన్నారు. అయితే… తన హాజరు తప్పని సరి భావిస్తే.. మరో తేదీ ఇవ్వాలని, అప్పుడు వస్తానంటూ లేఖలో స్పష్టం చేశారు.
అయితే.. పార్లమెంట్ సమావేశాలను పరిగణనలోకి తీసుకునే డేట్ ఫిక్స్ చేయాలని సూచించారు. మరో వైపు తనకు సిట్ పై నమ్మకం లేదని, తన దగ్గరున్న సమాచారాన్ని సిట్ కు ఇవ్వదల్చుకోలేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. మొదటి నుంచీ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనే తాను డిమాండ్ చేస్తున్నానని గుర్తు చేశారు. ”సిట్‌ను నేను విశ్వసించటం లేదు. నా దగ్గరున్న సమాచారాన్ని సిట్‌కు ఇవ్వదలుచుకోవటం లేదు. సిట్టింగ్ జడ్డితో విచారణ జరిపితే నా దగ్గరున్న సమాచారాన్ని అందిస్తాను. మాకు నమ్మకమున్న సంస్థలకే సమాచారం అందిస్తాం. ” అని బండి సంజయ్ స్పష్టం చేశారు.