పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో అరెస్టైన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రిమాండ్ ను రద్దు చేయాలని కోరుతూ బీజేపీ లీగల్ సెల్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. బండి సంజయ్ తరపు న్యాయవాదులు దీనిని దాఖలు చేశారు. హనుమకొండ కోర్టు విధించిన రిమాండ్ ను రద్దు చేయాలని కోరారు. అంతేకాకుండా దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. న్యాయవాదుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న సీజే జస్టిస్ ఉజ్జల భూయాన్… మధ్యాహ్నం 1 గంటకు విచారణ జరిపేందుకు అంగీకరించారు.
టెన్త్ పేపర్ లీకేజీ కుట్ర కేసులో హన్మకొండ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఏ1గా పేర్కొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ.. న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అయితే.. టెన్త్ హిందీ ప్రశ్నా పత్రం లీకేజీ కేసులో ఇరువైపులా వాదనలు విన్న మెజిస్ట్రేట్… పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌ను పూర్తిగా పరిశీలించి ఈమేరకు తీర్పు వెలువరించింది. అయితే.. పోలీసులు తన పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులకు బండి సంజయ్ వివరించారు. చొక్కా విప్పి మరీ తనకు తగిలిన గాయాలను న్యాయవాదులకు బండి సంజయ్ చూపించారు. దీంతో.. న్యాయమూర్తి నివాసంలో ఇరువైపుల న్యాయవాదులు వాదనలు వినిపించగా.. 14 రోజుల రిమాండ్ విధించారు.
వరంగల్ కమిషనరేట్ కమలాపూర్ లో జరిగిన హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో సంజయ్ ను పోలీసులు ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఆయనపై 120 (బి), 420, 447, 505 (1) (బి), ఐపీసీ 4(ఏ), రెవిత్ విత్ 8 ఆఫ్ టీఎస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ 1997, సెక్షన్ 66డీ, ఐటీ యాక్ట్ 2008 కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం కరీంనగర్ జైలులో వున్నారు.