ఏపీ విద్యా వ్యవస్థలో భారీ మార్పులకు వైసీపీ సర్కార్ కీలక అడుగువేసింది. ప్రపంచంతో ఏపీ విద్యార్థులు పోటీపడే విధంగా, అధునాతన విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రముఖ ఎడ్యుకేషన్ టెక్ కంపెనీ బైజూస్ తో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం చేసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో కమిషనర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సురేశ్ కుమార్, బైజూస్ వైస్ ప్రెసిడెంట్ సుస్మిత్ సర్కార్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
బైజూస్ ద్వారా ఏపీ ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలకు ఎడ్యుటెక్ విద్యను అందుబాటులోకి తేనున్నారు. ఏడాదికి 20 వేల నుంచి 24 వేల దాకా చెల్లిస్తే కానీ లభించని బైజూస్ విద్య.. ఇప్పుడు సర్కారు పాఠశాలల్లో 4 నుంచి 10 తరగతి వరకూ ఉచితంగానే అందుబాటులోకి రానుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇంగ్లీషు- తెలుగు మీడియాల్లో నేర్పించనున్నారు.
ఇక.. 4.7 లక్షల మంది పిల్లలకు ట్యాబ్ లు ఇచ్చేందుకు 500 కోట్లు ఖర్చు చేస్తామని, ఈ సెప్టెంబర్ నుంచి ట్యాబ్ లు అందుబాటులోకి వస్తాయని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. ప్రతి యేడాది 8 తరగతిలోకి వచ్చే వారికి ట్యాబ్ లు ఇస్తామన్నారు. వచ్చే యేడాది నుంచి బైజూస్ కంటెంట్ ను పొందుపరిచి, పాఠ్య పుస్తకాలను ముద్రిస్తామన్నారు. బైజూస్ తో చేసుకున్న ఈ ఒప్పందం ఎంతో కీలకమన్నారు. విద్యా రంగ వ్యవస్థలను మరింత మెరుగుపరచడానికి బైజూస్ ముందుకు రావడం ఆనందమని ఏపీ సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు.