Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

మంత్రి సబిత వ్యాఖ్యలపై బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థులు సీరియస్

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేపట్టిన భారీ నిరసన కార్యక్రమం మూడో రోజుకు చేరుకుంది. తమ సమస్యలను పరిష్కరించాల్సిందేనంటూ విద్యార్థులు పట్టుబడుతున్నారు. అటు మంత్రులు, కలెక్టర్ హామీ ఇచ్చినా.. విద్యార్థులు తమ ఆందోళనను మాత్రం విరమించుకోవడం లేదు. సీఎం కేసీఆర్ అయినా, మంత్రి కేటీఆర్ అయినా.. నేరుగా వచ్చి.. తమను కలిస్తేనే విరమణపై ఆలోచిస్తామని తెగేసి చెప్పేస్తున్నారు. మరో వైపు విద్యార్థుల డిమాండ్లు సిల్లీ డిమాండ్లు అంటూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలపై విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎక్కడో వుండి మాట్లాడటం కాదని, ఇక్కడి వచ్చి తమ సమస్యలేంటో చూడాలని మండిపడుతున్నారు. ఇక.. జిల్లా కలెక్టర్ వ్యవహార శైలిపై కూడా విద్యార్థులు మండిపడుతున్నారు.

ఇక విద్యార్థుల నిరసన మూడో రోజుకు చేరుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆర్జేయూకేటీ ప్రధాన గేటు వద్దకు విద్యార్థులు రాకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు రెండో గేటు వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక.. విద్యార్థుల నిరసనకు మద్దతుగా కుటుంబ సభ్యులు కూడా వచ్చి నిరసనలో పాల్గొన్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి, స్టేషన్ కు తరలించారు.

విద్యార్థుల నిరసనపై గవర్నర్ ట్వీట్

తమ సమస్యలను పరిష్కరించాలంటూ బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. జోరు వానలో కూడా విద్యార్థులు ఆందోళన చేస్తుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. విద్యార్థులందరూ తమ తమ ఆరోగ్యాలను చూసుకోవాలని కోరారు. తమ తల్లిదండ్రుల ఆశయాల సాధన దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని గవర్నర్ హామీ ఇచ్చారు. మరోవైపు తన ట్వీట్ ను గవర్నర్ తెలంగాణ సీఎంవో ట్విట్టర్ ఖాతాకు ట్యాగ్ చేశారు.

Related Posts

Latest News Updates