భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై నల్లగొండ జిల్లాలో కేసు నమోదైంది. చెరుకు సుధాకర్( Cheruku Sudhaker ) కుమారుడు సుహాస్ ఫిర్యాదు మేరకు నల్లగొండ ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో 506 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తనను చంపుతానంటూ కోమటిరెడ్డి ఫోన్‌లో బెదిరించారని చెరుకు సుహాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీ వెంకట్ రెడ్డితో తనకు ప్రాణహానీ ఉందని సుహాస్ తెలిపారు.
టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను తన అభిమానులు చంపేస్తారంటూ ఆయన కుమారుడికి ఫోన్‌లో వార్నింగ్ ఇచ్చారు. అసభ్య పదజాలంతో దూషించారు. ఆయన మాట్లాడిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో చెరుకు సుధాకర్ తనయుడు డాక్టర్ సుహాస్‌కు ఫోన్ చేసిన ఎంపీ కోమటిరెడ్డి.. తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. సుధాకర్‌ను చంపేందుకు తన అభిమానులు వంద కార్లలో బయటికి వచ్చారంటూ బూతులు తిట్టారు. అంతేకాదు ‘నిన్ను కూడా చంపుతారు. నీ ఆస్పత్రిని కూలగొడతారు’ అని కోమటిరెడ్డి సుహాస్‌ను బెదిరించారు.
ఈ క్రమంలో చెరుకు సుధాకర్ తనయుడు సుహాస్‌తో ఫోన్ కాల్ లో మాట్లాడిన వ్యవహారంపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. సుహాస్‌తో ఫోన్‌కాల్‌లో భావోద్వేగంలో నోరు జారిన మాట వాస్తవమేనంటూ పేర్కొన్నారు. పార్టీలో చేరిన దగ్గర నుంచి చెరుకు సుధాకర్ తనను తిడుతున్నారని.. ఎవరో మెప్పు కోసం నన్ను తిడితే ఎలా అంటూ పేర్కొన్నారు. వీడియోలకు నీచంగా టైటిల్స్ పెడుతున్నారు.. ఎందుకు అలా పెడుతున్నారని మాత్రమే ప్రశ్నించానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. తాను మాట్లాడిన కొన్ని విషయాలు కట్ చేసి, మిగతావి మాత్రమే లీక్ చేశారంటూ పేర్కొన్నారు.