మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే.. కేసీఆర్ అవినీతి సర్కారు మాయమైపోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సర్థార్ వల్లభాయ్ పటేల్ చొరవతో రజాకార్ల కబంధ హస్తాల నుంచి తెలంగాణకు విముక్తి లభించిందని, తాము గెలిస్తే సెప్టెంబర్ లో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా జరుపుతామని అమిత్ షా ప్రకటించారు. రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్ అవినీతి సర్కారు మాయం అవుతుందన్నారు. మునుగోడులో జరిగిన బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. కేసీఆర్ సర్కార్.. అబద్ధాలకోరు ప్రభుత్వం అంటూ ఆయన దుయ్యబట్టారు. మజ్లిస్ కు భయపడే… టీఆర్ఎస్ సర్కార్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రమే కాదని, రాబోయే రోజుల్లో మరింత మంది నేతలు బీజేపీలో చేరుతారని ప్రకటించారు. టీఆర్ఎస్ ను కూకటి వేళ్లతో పెకలించడానికే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని అన్నారు.
టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 3 వేల నిరుద్యోగ భ్రుతి ఇస్తామని ప్రకటించారని, ఇచ్చారా? అంటూ ప్రశ్నించారు. డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోగా… కేంద్రం నిర్మించే మరుగుదొడ్లను కూడా కేసీఆర్ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. దళితుడ్ని సీఎం చేస్తారని సీఎం ప్రకటించారని, టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే… తన కొడుకు కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తారే కానీ, దళితుడ్ని చేయరని పేర్కొన్నారు. ప్రతి దళితుడికి 3 ఎకరాలు భూమి ఇస్తామని వాగ్దానం చేశారని ఇచ్చారా? అంటూ ప్రశ్నించారు. మోదీ ప్రవేశ పెట్టిన ఫసల్ బీమా పథకం అమలు చేయని కారణంగా తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. తాము గనక అధికారంలోకి వస్తే.. ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.