నేషనల్ హెరాల్డ్ మనీ-లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మూడో రోజైన బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరు అవుతున్నారు. మనీ లాండరింగ్ కేసులో ఈడీ రెండు రోజుల పాటు రాహుల్ ను సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఈ సమయంలో రాహుల్ గాంధీ ఇచ్చిన సమాధానాలతో ఈడీ అధికారులు ఏమాత్రం సంతోషంగా లేదని, అందుకే మూడో రోజు కూడా రాహుల్ ఈడీ విచారణకు హాజరువుతున్నట్లు తెలుస్తోంది. మొదటి రోజు 9 గంటల పాటు, రెండో రోజు 10 గంటల పాటు రాహుల్ ను విచారించారు. మూడో రోజు ఎన్ని గంటల పాటు విచారిస్తారు? ఇంకా ఎవరినైనా మధ్యలో పిలుస్తారా? ఇంకా ఎవరెవరికి నోటీసులు ఇస్తారు? అన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు.
మరోవైపు ఢిల్లీలోని ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోస్తును ఏర్పాటు చేశారు. రాహుల్ ఈడీ విచారణకు హాజరువుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోని ఈడీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులకు భద్రత అనేది సవాల్ గా మారింది. రాహుల్ గాంధీ వరుసగా మూడోసారి కూడా విచారణకు హాజరువుతున్న నేపథ్యంలో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.
ఇక… రాహుల్ ఈడీ విచారణకు హాజరయ్యే ముందు తన సోదరి ప్రియాంక గాంధీ ఇంటికి వెళ్లారు. అక్కడ కాసేపు చర్చించుకున్నారు. ప్రియాంక నివాసం నుంచి వారిద్దరూ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ సమావేశం ముగిసిన తర్వాత వారిద్దరూ ఈడీ ఆఫీసుకు చేరుకోనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక… మంగళవారం ఈడీ విచారణ ముగిసిన తర్వాత రాహుల్ తన తల్లి, పార్టీ అధినేత్రి సోనియాను పరామర్శించడానికి ఆస్పత్రి వెళ్లారు.