నరేంద్ర మోదీ ప్రియమైన ప్రియమైన ప్రధాని కాదని.. పిరమైన ప్రధాని అంటూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సెటైర్లు వేశారు. తొర్రూరు సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సమాజానికి తమ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పే దమ్ము మాకుందని, సాక్ష్యాలు కూడా వున్నాయన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ఆ దమ్ముందా? అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ ఆడబిడ్డలకు ఏం చేశారు? తెలంగాణ గిరిజనులకు ఏం చేశారు? తెలంగాణ రైతులకు ఏం చేశారు? తెలంగాణలోని ఏ వర్గానికి ఏం చేశారో చెప్పే సత్తా వారికి ఉన్నదా? అంటూ ప్రశ్నించారు. ‘స్విస్ బ్యాంకుల్లోని నల్లధనం తెచ్చి పేదలకు పంచుతానని మోదీ చెప్పారని, మరి పంచాడా? రూ.15లక్షలు ఎవరి ఖాతాలో పడ్డాయి? అని అడిగారు. ఆ డబ్బంతా మోదీ తన స్నేహితుల ఖాతాలో వేశారని పరోక్షంగా అదానీ విషయాన్ని ప్రస్తావించారు.
వన్ నేషన్ వన్ రేషన్, వన్ నేషన్.. వన్ ట్యాక్ అన్నారని, ఇప్పుడు కొత్తగా వన్ నేషన్ వన్ ఫ్రెండ్ తీసుకు వచ్చారని, మొత్తం దోస్తుకు దోచిపెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పి.. గుజరాత్‌కు తీసుకుపోయారని, గుజరాత్‌లో రూ.20వేలకోట్లతో కోచ్ ఫ్యాక్టరీ పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. బయ్యారం ఉక్కు కర్మాగారం పెడుతామని చెప్పి మాట ఇచ్చి పెట్టారా? ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ పెడుతామని పెట్టారా? అంటూ ప్రశ్నించారు. రూ.70 పెట్రోల్‌ను రూ.110 చేసి పప్పు, ఉప్పు, నూనె, నెయ్యి అన్నింటిని ఫిరం చేశారని మండిపడ్డారు. మోదీ ప్రియమైన ప్రధాని కాదు.. ఫిరమైన ప్రధానమంత్రి అని అభివర్ణించారు. ఇవాళ ఏదీ ముట్టుకున్నా సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది అంటే కేవలం అది మోదీ వల్లే అని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.