హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసినట్లు కేంద్రం ప్రకటించడాన్ని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన సమయం నుంచే విభజన హామీలను పక్కన పెట్టేసిందంటూ మండిపడ్డారు. తెలంగాణలో ఐటీని మరింత డెవలప్ చేయడానికి తమ ప్రభుత్వం 2008 లో అప్పటి ప్రభుత్వానికి ఐటీఐఆర్ ప్రతిపాదనలు పంపామని గుర్తు చేసుకున్నారు. 2013 లో ఆమోదం కూడా లభించిందని, కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఐటీఐఆర్ తో పాటు ఎన్నో ప్రాజెక్టులను మూలన పడేసిందంటూ మండిపడ్డారు.
పైగా ఐటీఐఆర్ స్థాయిలో రాష్ట్రానికి పలు ప్రాజెక్టులను మంజూరు చేశామని పార్లమెంట్ వేదికగా తప్పులు చెబుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ డీఎన్ఏలోనే అసత్యాలు, అవాస్తవాలు, పచ్చి అబద్దాలు నిండి వున్నాయని విమర్శించారు. రాజకీయంగా వారితో విభేదిస్తున్నామన్న ఒకే ఒక్క కారణంతో హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దుచేసి మోదీ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని కేటీఆర్ ఆరోపించారు.