రాష్ట్రపతి ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మహారాష్ట్ర బుల్ కు ఒక్క సారిగా ప్రాధాన్యం పెరిగింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను విపక్ష నేతలు వరుసబెట్టి కలుసుకుంటున్నారు. రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల అభ్యర్థిగా పవార్ ను దింపాలన్న ఆలోచనలో విపక్ష నేతలున్నారు. అయితే శరద్ పవార్ మాత్రం విముఖత చూపిస్తున్నారు. అసలు తాను రాష్ట్రపతి పదవి రేసులో లేనని, తనను ఈ వ్యవహారంలోకి లాగొద్దని సొంత పార్టీ నేతలకే పవార్ క్లాస్ పీకారు. సోమవారం ఎన్సీపీ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పవార్ పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిణామాలు, మహారాష్ట్ర రాజకీయాలు చర్చించినా… రాష్ట్రపతి ఎన్నికల గురించే ఈ సమావేశం కీలకంగా చర్చించిందని అందులో పాల్గొన్న ఓ నేత ప్రకటించారు.
నేను రాష్ట్రపతి పదవి రేసులో లేను. ఈ పదవికి ప్రతిపక్షాల అభ్యర్థిని కూడా కాను అని పవార్ ఈ సమావేశం వేదికగానే కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎన్సీపీతో సహా విపక్షాల నేతలు ఇరకాటంలో పడిపోయారు. ఎలాగైనా పవార్ ను బరిలోకి దింపాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఎన్సీపీ అధినేత పవార్ తో భేటీ అయ్యారు. ఆయన్ను ఒప్పించే పనిలో పడ్డారు. రాష్ట్రపతి ఎన్నికలు, పవార్ అభ్యర్థిత్వం గురించే వీరిద్దరూ చర్చించుకున్నారు.
పవార్ తో భేటీ అయిన వామపక్ష నేతలు
ఎన్సీపీ అధినేత పవార్ తో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా భేటీ అయ్యారు. రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగాలని పవార్ ముందు డిమాండ్ పెట్టారు. ఈ ప్రతిపాదనను పవార్ సున్నితంగా తిరస్కరించారని సీతారాం ఏచూరీయే స్వయంగా వెల్లడించారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా నిలబడాలని ఆయన్ను కోరాం.. ఆయన తిరస్కరించారు. ఇతర అభ్యర్థిని వెతికే పనిలో పడ్డాం అని ఏచూరీ ప్రకటించారు.
బుధవారం ఢిల్లీ వేదికగా మమత కీలక సమావేశం
రాష్ట్రపతి ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ఎలాగైనా బీజేపీ అభ్యర్థిని ఓడించాలని ప్రతిపక్షాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బుధవారం ఢిల్లీలో ఓ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని కాన్సిస్టిట్యూషన్ క్లబ్ లో సమావేశం అవనున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సహా విపక్ష నేతలను మమత ఈ సమావేశానికి ఆహ్వానించారు. అనారోగ్య కారణాల రీత్యా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. ఆమె తరపు ప్రతినిధి ఎవరైనా హాజరవుతారా? అన్నది చూడాలి. ఇక… ఈ సమావేశంలో పాల్గొనడానికి ఎన్సీపీ చీఫ్ పవార్ ఇప్పటికే ఢిల్లీకి వచ్చేశారు.
ప్రతిపక్షాల ‘మూడ్ ఆఫ్’చేసిన పవార్
శరద్ పవార్.. అటు మహారాష్ట్ర రాజకీయాల్లో, ఇటు దేశ రాజకీయాల్లో ఆరి తేరిన నేత. క్రికెట్ రాజకీయాలను కూడా ఒంటిచేత్తో ఆడుతూ.. బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. రాజకీయాల్లో భీష్ముడిగా చెలామణి అవుతున్నారు. అటు ప్రధాని మోదీతో సహా.. నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్ తో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి వున్న నేత. ఇలా మోదీని దెబ్బ తీయాలని ప్రతిపక్షాలు పవార్ ను రాష్ట్రపతి ఎన్నికల రేసులోకి లాగాయి. కానీ.. తనకు ఏమాత్రం ఈ ఎన్నికలపై ఆసక్తి లేదని పవార్ తేల్చి చెప్పడంతో విపక్షాలు ఆయన్ను బుజ్జగించే పనిలో పడ్డాయి.