ప్రధాని మోదీ తీసుకున్న రాహుల్ గాంధీ అనర్హత వేటు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని..న్యాయం కోసం పోరాటం చేస్తామని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయటాన్ని నిరసిస్తూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల కేంద్రంలో కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు.
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశమని వ్యాఖ్యానించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. భారత్ జోడో యాత్రలో కులమతాలకు అతీతంగా ప్రజలు పాల్గొన్నారని చెప్పారు. కోర్టు తీర్పు వచ్చాక.. బెయిల్ ఇచ్చి 30 రోజుల సమయం ఇచ్చింది కానీ, 24 గంటలు గడవకముందే అనర్హత వేటు ప్రకటించడం దుర్మార్గమని మండిపడ్డారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు కొట్లాడాలి.. అంతేగానీ ఇలా కుట్రలు చేయకూడదన్నారు.