కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కామెంట్స్ పై అధికార బీజేపీ కౌంటర్ ఇచ్చింది. విమర్శించే హక్కు ఆయనకు వుంది కానీ.. అవమానించే హక్కు మాత్రం లేదని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఉద్దేశపూర్వకంగా వెనుకబడిన తరగతుల వారిని అవమానించారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ మీడియా ముందు తప్పుడు స్టేట్‌మెంట్లు ఇచ్చారని, అసలు విషయం మాట్లాడదలేదని అన్నారు.
2019లో చేసిన ప్రసంగంపైనే ఆయనకు శిక్ష పడిందని చెప్పారు. తాను ఆలోచించే మాట్లాడతానని రాహుల్ ఇవాళ చెప్పారని, దాని అర్ధం 2019లో ఆయన ఉద్దేశపూర్వకంగా మాట్లాడినట్టు కాదా? అని రవిశంకర్ ప్రసాద్ నిలదీశారు. లండన్‌లో తానేమీ చెప్పలేదంటూ మరోసారి రాహుల్ అబద్ధాలు ఆడారని అన్నారు. ఇండియాలో ప్రజాస్వామ్యం బలహీనంగా ఉందని, యూరోపియన్ దేశాలు దానిపై దృష్టి సారించడం లేదని రాహుల్ లండన్‌లో వ్యాఖ్యానించారని, అబద్ధాలు ఆడటం రాహుల్ నైజమని ఆయన విమర్శించారు.
తనపై అనర్హత వేటు పడిన సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొదటి సారిగా మీడియా ముందుకు వచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని ఆరోపించారు. తాను దేశంలో ప్రజాస్వామ్యం కోసం పోరాడానని, పోరాడుతూనే వుంటానని స్పష్టం చేశారు. తనపై అనర్హత వేటు వేసినా, జైలుకే పంపినా… భయపడేదే లేదని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే వుంటానని పేర్కొన్నారు. వ్యాపారవేత్త అదానీపై ప్రశ్నించినందుకే కేంద్రం తనపై అనర్హత వేటు వేసిందని ఆరోపించారు. ఇలాంటి అనర్హతల వంటివి తనను ఏమీ చేయలేవని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతూనే వుంటానని స్పష్టం చేశారు.