తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టమోటా, కోడిగుడ్లతో BRS నేతలు దాడికి దిగారు. భూపాలపల్లి జిల్లాలో రేవంత్ రెడ్డి యాత్ర హాథ్ సే హాథ్ జోడో యాత్ర సాగుతోంది. ఈ సందర్భంగా అక్కడ రేవంత్ రెడ్డి ప్రసంగిస్తుండగా… BRS నేతలు టమోటా, కోడిగుడ్లతో దాడికి దిగారు. రేవంత్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు కూడా చేశారు. సభా వేదిక వద్దకు దూసుకొచ్చేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు యత్నించారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగి.. ఇరుపార్టీల కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. అయితే… రేవంత్ రెడ్డికి ఏమీ కాలేదు. సభలో పాల్గొన్న ఇతరులకు ఇవి తగిలాయి. ఓ వైపు పోలీసులు BRS నేతలను అడ్డుకున్నా… వారు ఆగకుండా… దాడి చేస్తూనే వున్నారు.
ఈ క్రమంలో స్థానిక ఎస్సైకి గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. తనపై కోడిగుడ్లు వేయించడం కాదని, దమ్ముంటే ఇక్కడికి రావాలంటూ ఆయన సవాల్ విసిరారు. 100 మంది తాగుబోతులను తనపైకి పంపుతావా అంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అనుచరుల పనేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తలచుకుంటే నీ ఇల్లు కూడా వుండదని రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ కార్యకర్తల దాడిని రేవంత్ ఖండించారు. కాంగ్రెస్ కార్యకర్తలు గెలిపించిన ఇక్కడి ఎమ్మెల్యే దొరగడీలో గడ్డి తినేందుకు పార్టీ ఫిరాయించారని గండ్ర వెంకట రమణారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించినవారికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు.