వేర్పాటువాద నేత, ఖలిస్తానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. భారత్ లోనే కాకుండా కెనడా, యూకే, ఆస్ట్రేలియాలో కూడా భారత వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారు. తాజాగా… అమృత్‌పాల్, అతని అనుచరుల విషయంలో పంజాబ్ పోలీసులు, కేంద్రం అనుసరిస్తున్న వైఖరి మద్దతుదారులకు రుచించడం లేదు. దీంతో విదేశాల్లో కూడా ఆగడాలకు దిగుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రవాస సిక్కుల్లోని ఓ వర్గం లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం వద్ద ఖలిస్థాన్ మద్దతుదారులు ఆందోళన చేపట్టారు. ఖలిస్థాన్ జెండాలతో పెద్ద సంఖ్యలో నిరసన చేపట్టారు.లండన్‌లోని భారత్ హైకమిషన్ భవనంపై ఎగురవేసిన జాతీయ జెండానును కిందికి దింపివేశారు. దీంతో వెను వెంటనే భారత్ హైకమిషన్ సిబ్బంది, భవనంపై భారీ త్రివర్ణ పతాకాన్ని ఎగరేసింది. లండన్ లో ఖలిస్థాన్ వేర్పాటువాదులు చేసిన పనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు భారత్ పేర్కొంది. దీనికి బాధ్యులైనవారిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.