రాష్ట్రపతి ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ఆ పీఠాన్ని ఎవరు అధిష్ఠిస్తారన్న ఉత్సుకత అందరిలోనూ వుంది. తదుపరి రాష్ట్రపతి ఎవరన్నది అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు అధికార బీజేపీ, ఇటు ప్రతిపక్షాలు వారి వారి వ్యూహాలను రచిస్తున్నాయి. అయితే ఇరు పక్షాలు కూడా ఇప్పటి వరకూ తమ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. బీజేపీ తరపున మాత్రం ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా వున్న వెంకయ్య నాయుడి పేరునే రాష్ట్రపతి పదవికి సూచిస్తారని తెగ ఊహాగానాలు, వార్తలు వచ్చాయి. అటు సంఘ్ కి గానీ, ఇటు పార్టీకి గానీ వెంకయ్య దగ్గరి వ్యక్తే. పైగా బీజేపీ అధిష్ఠానం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. ఈ కోణంలో వెంకయ్య నాయుడి పేరును బీజేపీ కచ్చితంగా ప్రకటిస్తుందని అందరూ భావిస్తున్నారు. అంతేకాకుండా అన్ని పార్టీలకు దగ్గరివారిగా, వివాద రహితుడిగా, విద్యావంతుడిగా వెంకయ్యకు పేరుంది.
అయితే.. రాష్ట్రపతి పదవికి ఎన్నిక తేదీ దగ్గరపడుతున్న కొద్దీ… వెంకయ్య నాయుడి పేరు మెళ్లి మెళ్లిగా వెనక్కి వెళ్లిపోతోంది. మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము, తెలంగాణ గవర్నర్ తమిళిసై, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, అసోం గవర్నర్ జగదీశ్ ముఖి, అనసూయ యూకీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేరు కూడా రాష్ట్రపతి అభ్యర్థిగా తెరపైకి వచ్చింది. ఈ పేర్లలో మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము పేరే అత్యంత బలంగా వినిపిస్తోంది. ఇక.. మరో ఫార్ములా కూడా అధికార బీజేపీ వద్ద ఉందన్న వార్తలు వస్తున్నాయి.
ఈ మధ్య బీజేపీ జోరుగా బీసీ వాదాన్ని ఎత్తుకుంది. అనాదిగా సంప్రదాయ ఓటు బ్యాంకుగా వస్తున్న బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఈ సారి ఛాన్స్ ఇవ్వాలన్న ఆలోచనలో కూడా ఉందన్న వార్తలు వస్తున్నాయి. రాష్ట్రపతి అభ్యర్థిత్వం బ్రాహ్మణ వర్గానికి ఇచ్చి, ఉప రాష్ట్రపతి ఛాన్స్ మైనారిటీ నేతకు ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా బీజేపీ దగ్గర వుంది. ఈ కోటాలోనే హఠాత్తుగా కేంద్ర మాజీ మంత్రి దినేశ్ త్రివేదీ పేరు తెరపైకి వచ్చింది. ఇన్ని పేర్లు చక్కర్లు కొడుతున్నాయి కానీ.. వెంకయ్య నాయుడి పేరు మాత్రం ముందుకు రావడం లేదు. దీంతో రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి బీజేపీ వెంకయ్య పేరును పక్కన పెట్టిందన్న వార్త రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
ఉప రాష్ట్రపతి పదవికి కూడా వెంకయ్యను రెన్యువల్ చేయరా?
ఇక.. ఉప రాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడిని అదే పదవికి మరోసారి రెన్యువల్ చేస్తారన్న వాదన కూడా ఒకటి బలంగా వినిపిస్తూ వచ్చింది. రాజ్యసభను అంచనా వేసుకొని, బీజేపీ మరోసారి వెంకయ్యకే ఉప రాష్ట్రపతిగా ఛాన్స్ కల్పిస్తుందన్న వార్తలు వచ్చాయి. హఠాత్తుగా ఈ కోణం కూడా మారిపోతూ వస్తోంది. తదుపరి ఉప రాష్ట్రపతి పదవి మైనారిటీ నేతకు ఇవ్వాలన్న ఆలోచనలో బీజేపీ వుంది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేరు బలంగా వినిపిస్తోంది. ఆయన్ను ఉప రాష్ట్రపతి పదవికి నామినేట్ చేయడానికి సర్వ సన్నద్ధమైనట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అప్పటికప్పుడు వ్యూహాలు మారి, నఖ్వీ పేరు పక్కకు పోయినా.. ఈ పదవి మాత్రం కచ్చితంగా మైనారిటీ కోటాకు ఇచ్చేందుకు బీజేపీ అధిష్ఠానం నిర్ణయించుకుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.