విపత్కర పరిస్థితుల్లోనూ ఆహార కొరత ఏర్పడకుండా ఆహార ధాన్యాలను వీలైనంత ఎక్కువ నిల్వ చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు సూచించారు. ఈ ఏడాది వేసవి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ నిపుణుల వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో సోమవారం ఆయన తన నివాసంలో అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మండు వేసవి నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు, వైద్య నిపుణులకు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీలు వంటి స్థానిక సంస్థలకు, విపత్తు నిర్వహణ సిబ్బందికి విడివిడిగా సూచనలు, అవగాహన పెంపొందించే సమాచారాన్ని రూపొందించి పంపిణీ చేయాలని ప్రధాన మంత్రి అధికారులకు సూచించారు.
తీవ్ర వేడి వాతావరణాన్ని ఎదుర్కోవడంపై చిన్నారులకు మల్టీమీడియా విధానంలో కొన్ని ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కూడా సూచించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జింగిల్స్, షార్ట్ ఫిల్మ్స్, కరపత్రాలు సహా వివిధ మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పించాలని ఆదేశించారు.వాతావరణ హెచ్చరికలు, సూచనల గురించి వాతావరణ శాఖ ప్రతిరోజూ ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా సమాచారాన్ని విడుదల చేయాలని ప్రధాని ఆదేశించారు.
అలాగే ప్రజలు ప్రాణాలు కాపాడాల్సిన ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీ ఎంత మేర పాటిస్తున్నారన్నది తెలుసుకోవాలని, ఆ మేరకు సమగ్ర ఫైర్ ఆడిట్ జరిపించాలని ప్రధాని సూచించారు. ఆస్పత్రుల్లో అగ్నిప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన ఉదంతాల నేపథ్యంలో ప్రధాని ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అగ్నిమాపక వ్యవస్థ, ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా బయటపడాలన్న అంశాలపై మాక్ డ్రిల్స్ నిర్వహించేలా సంసిద్ధం చేయాలని సూచించారు.