ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. దీంతో టీడీపీ శ్రేణులు జోష్ గా సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంబరాలు కొనసాగాయి. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో చంద్రబాబు ఇతర నేతలతో కలిసి పెద్ద కేక్ ను కట్ చేశారు. కార్యకర్తలు బయట టపాసులు కాలుస్తూ…. ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ స్థానం గెలవడంపై టీడీపీ నేతలు తెగ ఆనందం వ్యక్తం చేశారు. ఈ యేడాది 2023 టీడీపీదేనని సీనియర్ నేత అచ్చెన్నాయుడు ప్రకటించారు.
తమ ఎమ్మెల్యేల మీద నిఘా పెట్టారని, వ్యాపారాలు దెబ్బతీసే ప్రయత్నాలు చేశారన్నారు. అయినా… తామే గెలిచామన్నారు. గెలిచినట్లు చెప్పినా… మళ్లీ రీకౌంటింగ్ చేయడం ఏంటని అచ్చెన్నాయుడు సీరియస్ అయ్యారు. అయినా… రీకౌంటింగ్ లోనూ తామే గెలిచామన్నారు. తమ అభ్యర్థి పంచుమర్తికి ఎవరు ఓటేశారో తమకు అనవసరమని, ఈ విషయం కూడా తమ తెలియదన్నారు. సీఎం జగనే స్వయంగా తమ అభ్యర్థికి ఓటు వేశారేమో… అంటూ సంచలన వ్యాఖ్యలకు దిగారు.
అయితే.. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్ కి పాల్పడినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అయితే… ఎమ్మెల్యే శ్రీదేవి విషయంలో ప్రచారం బాగా జరుగుతుండటంతో ఆమె స్పందించారు. తాను క్రాస్ ఓటింగ్ చేయలేదని, ఆ అవసరమే తనకు లేదని స్పష్టం చేశారు. ఉదయమే తన కుమార్తెతో పాటు సీఎం జగన్ ని కలిశానని, సొంత అన్నలా చూసుకుంటానని నాతో జగన్ చెప్పారని వెల్లడించారు. జగన్ గారి నుంచి నాకు స్పష్టమైన హామీ వచ్చిందని, క్రాస్ ఓటింగ్ చేసిందెరో రెండ్రోజుల్లో నిజా నిజాలు బయటికొస్తాయన్నారు. తమకు కొన్ని విలువలు ఉన్నాయి. విలువలతో కూడిన రాజకీయాలకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. దళిత మహిళపై దుష్ప్రచారం చేయొద్దు. దళిత మహిళను కాబట్టే ఇలా చులకనగా చూస్తున్నారని మండిపడ్డారు.