కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ నిరసన మన సికింద్రాబాద్ నూ తాకింది. అగ్నిపథ్ పై దేశ వ్యాప్తంగా నిరసన కొనసాగుతున్న విషయం తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనకారులు నానా బీభత్సం చేశారు. హైదరాబాద్ నుంచి కోల్ కత్తా ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ కు ఒక్కసారిగా నిప్పంటించారు. పార్సిల్ సామాన్లను కూడా తగలబెట్టేశారు. తాజాగా ప్రకటించిన అగ్నిపథ్ ను రద్దుచేసి, యథావిథిగానే సైనిక ఎంపిక కొనసాగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.

పెద్ద సంఖ్యలో యువకులు ఒక్కసారిగా ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. అయితే నిరసనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై కూడా నిరసనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి మరింత దిగజారింది. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రణరంగమైంది. ఒక్కసారిగా పెద్ద మొత్తంలో ఆందోళన చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అధికారులు అక్కడి రైళ్లంటినీ నిలిపేశారు.