నిర్మల్ జిల్లా బాసరలోని ఆర్జేయూకేటీ- ట్రిబుల్ ఐటీలో విద్యార్థుల నిరసన రెండు రోజు కూడా కొనసాగుతూనే వుంది. వేలాది మంది విద్యార్థులు మెయిన్ గేటు ముందు బైఠాయించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వచ్చి హామీ ఇస్తేనే తాము నిరసనను విరమిస్తామని తెగేసి చెబుతున్నారు. సుమారుగా 6 వేల మంది విద్యార్థులు గేటు ముందు బైఠాయించి, భారీ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
విశ్వ విద్యాలయంలో అనేక సమస్యలు ఉన్నాయని, సౌకర్యాల కొరత తీవ్రంగా ఉందని, సామాగ్రి సరఫరా విషయంలోనూ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఫైర్ అవుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకూ పూర్తి కాలపు వీసీయే నియామకం కాలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లుగా డ్రెస్సుల పంపిణీ లేదని, ల్యాప్ ట్యాపులు కూడా ఇవ్వడం లేదన్నారు. ఈ సమస్యలన్నింటికీ సత్వరమే పరిష్కారం చూపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు వారి తల్లిదండ్రులు కూడా తోడయ్యారు. దీంతో మరింత ఎక్కువైంది. పోలీసులు భారీ బందోస్తును ఏర్పాటు చేసి, పర్యవేక్షిస్తున్నారు.
ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ స్పందన..
సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్జీయూకేటీ బాసరలో విద్యార్థులు నిరసన తెలపడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ విషయంలో స్పందించాలంటూ తేజగౌడ్ అనే యువకుడు మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేశాడు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలనకు పంపుతామని హామీ ఇచ్చారు. విద్యలో నాణ్యత పెరగడానికి కూడా తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేటీఆర్ అన్నారు. ఇక… ఇదే అంశంపై విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా స్పందించారు. విద్యార్థుల సమస్యలపై వీసీతో సమావేశమవుతామని ప్రకటించారు.