బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీఎం కే. చంద్రశేఖర రావుకు ఝలక్ ఇచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల విషయమై సీఎం మమత ఢిల్లీలో ఓ సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి ప్రతిపక్షాలను ఆహ్వానించారు. అయితే ఈ సమావేశానికి హాజరు కాకూడదని తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి మమతా బెనర్జీ కాంగ్రెస్ ను కూడా ఆహ్వానించారు. ఈ కారణంతోనే సీఎం కేసీఆర్ దూరంగా వున్నారని సమాచారం. తాము ప్రస్తుత పరిస్థితుల్లో అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్ కు సమాన స్థాయి దూరాన్ని పాటిస్తున్నామన్న సంకేతాలను పంపడానికే సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టినట్లు సమాచారం.
అయితే.. కొన్ని రోజుల క్రితం ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి విషయమై బెంగాల్ సీఎం మమత సీఎం కేసీఆర్ కు ఫోన్ చేశారు. కాంగ్రేసేతర విపక్షాలతో ఢిల్లీలో ఓ సమావేశం నిర్వహించి, ఏకాభిప్రాయానికి రావాలని సీఎం కేసీఆర్ స్వయంగా సూచించారు. అప్పుడు మమతా బెనర్జీ ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పారు. కానీ… ఒక్కసారిగా తన ప్లాన్ ను మార్చేశారు. సీఎం కేసీఆర్ సలహా విన్నట్లే విని… తన పని తాను చేసుకుపోతున్నారు మమత. దీంతో సీఎం కేసీఆర్ ఆ సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయంపై సీఎం కేసీఆర్ పార్టీ ముఖ్యలతో సమావేశం నిర్వహించారు. పార్టీ ప్రతినిధులను కూడా పంపొద్దని కచ్చితమైన స్టాండ్ తీసుకున్నారు.
ఇక.. కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం లేదు. ఈ సమావేశానికి తాము హాజరు కాలేమని తేల్చి చెప్పింది. అభ్యర్థి ఎవరో ప్రకటించిన తర్వాత… తమ స్టాండ్ ప్రకటిస్తామని ఆ పార్టీ అధికార ప్రతినిధులు పేర్కొంటున్నారు. అభ్యర్థి తేలనంత వరకూ మద్దతు ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయితే.. మమతా బెనర్జీ సమావేశానికి ఎన్సీపీ అధినేత పవార్, సోనియాకు బదులు కాంగ్రెస్ ప్రతినిధులు మాత్రం హాజరవుతున్నారు.