తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు జాతీయ రాజకీయాల్లో కూడా కీలకపాత్ర వహించాలన్న ఉద్దేశ్యంతో జాతీయ పార్టీ ఏర్పాటుకు అవసరమైన రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన నేతగా పేరు పొందిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వీరి కలయిక రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.
రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, కాంగ్రెస్ ఫ్రంట్తోపాటు, మమతా బెనర్జీ ప్రతిపాదిస్తున్న ప్రత్యామ్నాయ ఫ్రంటల నేపథ్యంలో సీఎం కేసీఆర్తో ఉండవల్లి భేటీ తీవ్ర ప్రాధాన్యత సంతరించుకున్నది. భవిష్యత్లో ఏపీ సీఎం జగన్తో కలిసి జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయాల్సి వస్తే ఉండవల్లి కీలకంగా మారుతారని ఆయన భావిస్తున్నట్లుగా రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో ఢల్లిలో కీలకంగా పనిచేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఢల్లి రాజకీయ, అధికారిక వర్గాల్లో మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ పరిచయాలు తనకు ఉపయోగపడగలవని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎపిలో కూడా పార్టీని బలోపేతం చేసేందుకు ఉండవల్లి కీలక పాత్ర పోషించాలని కేసీఆర్ కోరినట్లు తెలిసింది.