అమెరికా లోని సెయింట్ లూయిస్ నగరంలో ఉన్న ది హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్ లో భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున శ్రీవారి కల్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
అద్భుతంగా అలంకరింప బడిన వేదిక పై తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వేంచేపు చేశారు. మంగళ వాయిద్యాలు, భక్తి సంగీత గానం నడుమ శాస్త్రోక్తంగా, వేద మంత్రాలతో అద్భుతంగా ఈ వేడుక నిర్వహించారు.
వేలాది మంది భక్తులు శ్రీవారి కళ్యాణ వేడుక చూసి తరించారు. కళ్యాణం అనంతరం భక్తుల నృత్య ప్రదర్శనల నడుమ గరుడ వాహన సేవ కన్నుల పండువగా నిర్వహించారు.
టీటీడీ ఛైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి దంపతులు,
ఎఈవో శ్రీ వెంకటేశ్వర్లు , ఎస్వీబీసీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస రెడ్డి, ఎ పి ఎన్నార్టీ చైర్మన్ శ్రీ మేడపాటి వెంకట్, నార్త్ అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి శ్రీ రత్నాకర్, నాటా ప్రెసిడెంట్ శ్రీ శ్రీధర్ రెడ్డి కొరిశపాటి కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.
సెయింట్ లూయిస్ వాస్తవ్యులు శ్రీ తాటిపర్తి గోపాల్ రెడ్డి, పమ్మి సుబ్బారెడ్డి,
ది హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ రజనీకాంత్ గంగవరపు, అధ్యక్షురాలు శ్రీమతి రాజ్యలక్ష్మి నాయుడు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు స్వామివారి కళ్యాణం సెయింట్ లూయిస్ నగరంలో నిర్వహించడానికి సహకారం అందించారు.