రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, అమెరికాలోని ప్రస్తుత పరిస్థితుల రీత్యా హెచ్- 1 బీ వీసాల సంఖ్య పెంచాలన్న డిమాండ్ అమెరికాలో ఊపందుకుంది. యూఎస్ కాంగ్రెస్ మాజీ సభ్యురాలు మియాలవ్ ఈ డిమాండ్ ను తాజాగా తెరపైకి తెచ్చారు. అమెరికా ఆర్థిక అభివృద్ధిలో విదేశీయులు, నిపుణుల పాత్ర ఎంతో వుందని, వారిని మరవొద్దని ఆమె సెనేట్ జ్యుడీషియరీ ముందు వ్యాఖ్యానించారు.
విదేశీ నిపుణులకు జారీ చేస్తున్న హెచ్ 1బీ వీసాల సంఖ్యను ప్రస్తుత అవసరానికి అనుగుణంగా పెంచాల్సిందేనని ఆమె తేల్చి చెప్పారు. ఇలా పెంచితే ఎక్కువ సంఖ్యలో విదేశీ నిపుణులు అమెరికాకు తరలి వస్తారని, దీని ద్వారా ఆర్థికంగా అమెరికా బాగా మెరుగుపడుతుందని మియాలవ్ అంచనా వేశారు.
వ్యాపారాలు, వాణిజ్యం విపరీతంగా పెరిగి, అమెరికన్లకు ఉద్యోగ, ఉపాధి కూడా వస్తుందని, దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందని ఆమె పేర్కొన్నారు. కేవలం విదేశీ నిపుణులతో పాటు వలస కార్మికులు కూడా పెద్ద సంఖ్యలో అమెరికాలోకి అనుమతించడం ద్వారా కార్మికుల కొరత కూడా తీరుతుందని ఆమె అన్నారు.