ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పర్యటనకు అంతా సిద్ధమైపోయింది. అల్లూరి జయంతి వేడుకలను పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ భీమవరానికి వెళ్లనున్నారు. అక్కడ అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ ఏపీ సీఎం వైఎస్ జగన్, గవర్నర్ విశ్వభూషణ్ ప్రధానికి స్వాగతం పలుకుతారు. అల్లూరి కుటుంబ సభ్యులు, వారసులతో ప్రధాని మోదీ, సీఎం జగన్ ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీ అల్లూరి కుటుంబీకులను సత్కరిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
సభా వేదిక నుంచే వర్చువల్ విధానం ద్వారా భీమవరం పట్టణంలోని సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పక్షాన సీఎం జగన్ ప్రధానిని సత్కరిస్తారు. ఈ సభలో ప్రధాని మోదీ, సీఎం జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, బీజేపీ నేతలు పురంధ్రీశ్వరి, సోము వీర్రాజు, అల్లూరి కుటుంబ సభ్యులు, ట్రస్ట్ సభ్యులు పాల్గొంటారు. ఆ తర్వాత గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఢిల్లీకి వెళతారు.
వేదికపై 11 మందికే చోటు
భీమవరంలో జరిగే ప్రధాని మోదీ సభలో స్టేజీపై కేవలం 11 మంది మాత్రమే కూర్చోనున్నారు. ప్రధాని మోదీ, గవర్నర్ విశ్వభూషణ్, సీఎం జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, పురంధరేశ్వరి, సోము వీర్రాజు, నిమ్మల రామానాయుడు, అల్లూరు ఆర్గనైజేషన్ కమిటీ, వసుధ ఫౌండేషన్ సభ్యులు, మంతెన వెంకట రామరాజు, పేరిచర్ల రాజు వేదికపై వుంటారు. ఈ సభకు 60 వేల మంది హాజరవుతున్నారు. 3 వేల మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు.