ఉత్కంఠత వీడిపోయింది. ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ పూర్తి చేసుకొని, ఢిల్లీలోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసానికి చేరుకున్నారు. దీంతో కవితను అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాలకు తెరపడింది. రాత్రి 9.10 గంటలకు ఈడీ ఆఫీసు నుంచి కవిత బయటకు వచ్చారు. అప్పటికే వర్షం పడుతుండటంతో వర్షంలోనే నడుచుకుంటూ ఈడీ ఆఫీసు గేట్ వరకు వచ్చిన కవిత.. వాహనంలో ఎక్కారు. ఈ సందర్భంలో అక్కడే ఉన్న కార్యకర్తలకు ‘వీ’ సింబల్ చూపిస్తూ… అభివాదం చేశారు.
పలువురు కార్యకర్తలు ఈడీ ఆఫీసు ముందే గుమ్మడి కాయతో దిష్టి తీశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు 10 గంటల పాటు విచారించారు. ఈ 10 గంటల్లో 14 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. అందులో 100 కోట్ల ముడుపులు, సౌత్ లాబీయింగ్, సెల్ ఫోన్లను పగలగొట్టడం లాంటి ప్రశ్నలున్నట్లు తెలుస్తోంది.
అయితే… కవిత ఒక్కరినే ఈడీ విచారించినట్లు తెలుస్తోంది. రామచంద్ర పిళ్లై, సిసోడియాతో కలిపి కవితను విచారించినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే… కవిత ఒక్కరినే ప్రశ్నించామని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే.. అరుణ్ పిళ్లై వాంగ్మూలాల నుంచే కవితను ఈడీ ప్రశ్నలడిగింది.
సౌత్ గ్రూప్ లోని సమీర్ మహేంద్రు, అమిత్ అరోరా, శరత్ చంద్రా రెడ్డి, అభిషేక్ బోయినపల్లి, మాగుంట రాఘవ, బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్లై ఇచ్చిన వాంగ్మూలంపై క్రాస్ ఎగ్జామిన్ చేసినట్లు తెలిసింది. ఢిల్లీ, హైదరాబాద్ హోటల్స్ లో పాల్గొన్న వీడియో పుటేజ్, బుచ్చిబాబు, పిళ్లై మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణలకు సంబంధించిన స్టేట్మెంట్ తదితర అంశాలపై ఆరా తీసినట్లు సమాచారం. కవిత వెల్లడించి అంశాలను ఈడీ అధికారులు స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది.