Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

శత వసంతాల సీతాబాయి…

రాయప్రోలు సీతాబాయికి వంద సంవత్సరాలు. శత వసంతాల సీతాబాయి పూర్ణాయుష్షు సీతాబాయి. రజాకార్ ఉద్యమం నడుస్తున్న సమయంలో రజాకార్లకు దీటుగా ఎదుర్కొంటూ.. వారి దాష్టీకాలకు ఈ సీతాబాయి ప్రత్యక్ష సాక్షి. ఒకానొక సమయంలో రజాకార్లు తన ఇంటికే వస్తే.. అచ్చు వారి దుస్తులే ధరించి.. వారికే షాకిచ్చారు. అంతేకాకుండా అప్పట్లో ప్లేగు వ్యాధి భయంకరంగా వ్యాపించింది. అప్పుడు అక్కడి శిబిరాల్లోనే ఆవిడ తలదాచుకుంటూ కాలం వెల్లబుచ్చారు.

జూన్ 24,1923 లో జన్మించిన సీతాబాయ్ ఇవాళ అంటే జూన్ 24, 2022 కి శత వసంతం లోకి అడుగుబపెట్టారు. 

అన్నట్లు సీతాబాయి భర్త పేరు వేంకట కృష్ణ దీక్షితులు. బ్యాంక్ ట్రైనింగ్ కాలేజీలో ప్రిన్సిపాల్ గా పనిచేశారు. 1989 లో మరణించారు. అయితే భర్త ఉద్యోగ రీత్యా సీతాబాయి మహారాష్ట్ర, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నివసించారు. ప్రస్తుతం హైదరాబాదులోనే సీతాబాయి కుటుంబం నివాసం వుంటుంది. సీతాబాయి తల్లిదండ్రులు పేరు జ్ఞాన ప్రసూనాంబ, వేంకటేశ్వర్లు. తండ్రి బాగా చదువుకున్న వ్యక్తి. నూజివీడులోని మహారాజా దగ్గర దివాన్ గా పనిచేశారు. సీతాబాయికి ఇద్దరు అన్నలు.. ఇద్దరు చెల్లెలు. ప్రఖ్యాత రచయిత్రి మాలతీ చందూర్ సీతాబాయి రెండో చెల్లెలే.

సీతాబాయికి తెలుగు, తమిళం, కన్నడం, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ కరతలామలకం. సంగీతంలోనూ అభినివేశం వుంది. వయోలీన్ ను అద్భుతంగా నేర్చుకున్నారు. అప్పట్లో సాహితీవేత్తలందరూ మద్రాస్ వేదికగా వుండేవారు. వ్యాసంగమూ అక్కడి నుంచే చేసేవారు. అంతేకాకుండా ప్రముఖ సాహితీ సంస్థలకు కూడా మద్రాసే వేదికగా సాగింది. దీంతో ప్రాచుర్యమూ అంతే లభించేది. అయితే.. భర్త ఉద్యోగ రీత్యా మహారాష్ట్ర, హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లోనే వుండిపోవటం వల్ల సీతాబాయికి సాహిత్యంతో అభినివేశం కలగలేదు.

ఇంకో విశేషం కూడా వుంది. మాలతీ చందూర్ రాసిన మొట్ట మొదటి కథ డాబా ఇల్లు. ఆవిడ సాహిత్యం పరిచయం వున్న వారందరికీ తెలుసు. అయితే ఈ డాబా ఇల్లుకు మూలం సీతాబాయి ఖైరతాబాద్ లో అద్దెకున్న ఇల్లే. ఈ ఇంటిని చూసే మాలతీ చందూర్ డాబా ఇల్లు అన్న కథ రాశారు. ఆ కథ చదివిన ఇంటిగలవాళ్ళు వచ్చి ఎక్కడ గొడవచ్చేస్తారో అని చాలాకాలం భయపడ్డారుట. ఆ విషయం సీతబాయే స్వయంగా చెప్పారు. సీతాబాయికి నూరు సంవత్సరాలు నిండినా… సమయ పాలన కచ్చితంగా పాటిస్తారు. పని చేస్తూనే వుంటారు. ఇవే ఆవిడ ఆరోగ్య రహస్యాలు. అయితే.. ఇంత వయస్సు మీద పడినా.. మంచి మంచి పచ్చళ్లు, మంచి మంచి వంటకాలు.. చేస్తారు. కేవలం ఆవిడ తినడమే కాదు.. ఇంటికి వచ్చిన అతిథులకు కూడా వాటి రుచి చూపిస్తారు. ఆవిడ ఇంటికి వెళ్లామా… రుచికరమైన భోజనం తయార్. ఆ భోజనంలో తన శత వసంతాల అనుభవమంతా రంగరించి వుంటుంది. అదో అమృతం. ఆ శత వసంతాల సీతాబాయి తిన్న తిండి తింటే మనమూ నూరు సంవత్సరాలు నిరాటంకంగా జీవించొచ్చు. మన వంశాకురాలని చూసి ముచ్చటపడొచ్చు. ఆ శతాధిక వృద్ధురాలికి జన్మదిన శుభాకాంక్షలు.

Related Posts

Latest News Updates