బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా తన బెయిల్ పిటిషన్ ను కూడా తిరస్కరించింది. దీంతో పోలీసులు ఆయన్ను చంచల్ గూడ జైలుకు తరలించారు. రాజాసింగ్ అప్ లోడ్ చేసిన ఓ వీడియో వివాదాస్పదం కావడంతో నిన్న రాత్రి నుంచి ఓ వర్గం వారు సిటీ పోలీసు కమిషనర్ కార్యాలయంతోపాటు భవానీ నగర్, డబీర్ పురా, రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ల ముందు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. దీంతో రాజా సింగ్ ను మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. సాయంత్రం 4 గంటలకు నాంపల్లి కోర్టులో హాజరపరిచారు. ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు.. కోర్టులో హాజరుపరచనున్న నేపథ్యంలో ఎంఐఎం, బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పోలీసులు ముందు జాగ్రత్తగా కోర్టుకు చాలా దూరంలోనే బారికేడ్లు ఏర్పాటు చేశారు. బీజేపీ కార్యకర్తలు, ఎంఐఎం కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
ఇదిలా ఉంటే ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. బీజేపీ హైకమాండ్ రాజాసింగ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో..సెప్టెంబర్ 2లోగా వివరణ ఇవ్వాలని రాజాసింగ్‌ను పార్టీ ఆదేశించింది. అంతేగాక బీజేఎల్పీ పోస్ట్ నుంచి రాజాసింగ్‌ను అధిష్టానం తప్పించింది.