కొండగట్టు ఆంజనేయ స్వామి ప్రధాన ఆలయంలో చోరీ జరిగింది. గర్భగుడిలోని రెండు విగ్రహాలు చోరీ అయ్యాయి. దీంతో పాటు స్వామి వారి 2 కిలోల మకర తోరణం, వెండి తోరణం ఎత్తుకెళ్లారు. అలాగే 3 శఠగోపాలు కలిపి మొత్తం 15 కిలోల వరకూ ఆభరణాలను ఎత్తుకెళ్లారు. వీటన్నింటి విలువ సుమారు 9 లక్షల వరకూ వుండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ దొంగతనం జరగగానే అధికారులు ఆలయాన్ని మూసేశారు. విచారణను ప్రారంభించారు.
మరోవైపు పోలీసులు కూడా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ ని కూడా రంగంలోకి దింపారు. మరోవైపు ఆలయ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు. కొన్ని రోజుల క్రిందటే సీఎం కేసీఆర్ కొండగట్టును సందర్శించారు. ఆలయ అభివృద్ధి కోసం 100 కోట్లను కేటాయించారు. ఆలయ విస్తరణ, మౌలిక సదుపాయాలపై అధికారులతో చర్చించారు.
నిన్న అర్ధరాత్రి స్వామి వారి పవళింపు సేవ ముగిసిన తర్వాత ఆలయ ప్రధాన అర్చకులు ప్రధాన ద్వారానికి తాళాలు వేసి వెళ్ళిపోయారు.తిరిగి ఉదయం ఆలయాన్ని తెరిచి సుప్రభాత సేవ నిర్వహించేందుకు వెళ్లిన అర్చకులు ప్రధాన ద్వారం నుండి దొంగలు చొరబడినట్టు గుర్తించారు . ప్రధాన ఆలయంలో బంగారు నగలతో పాటు కొన్ని విగ్రహాలను చోరీ చేసినట్టు గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. దొంగలు ప్రధాన ఆలయం తాళాలు పగలగొట్టి రెండు విగ్రహాలను ఎత్తుకెళ్లారు.