రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ లోకసభలో మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగం అందరికీ మార్గనిర్దేశం చేసిందన్నారు. మంగళవారం సభలో కొందరు చాలా ఉత్సాహంగా కొన్ని వ్యాఖ్యలు చేశారని, అవిచూసి కొందరు థ్రిల్ అయ్యారని మోదీ రాహుల్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు వారి మనసులోని ద్వేషాన్ని బయటపెట్టాయని కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడిన మోడీ….. ఓ పెద్ద నాయకుడు రాష్ట్రపతిని విమర్శించారని, నేతల వ్యాఖ్యలు వారి మనసులోని ద్వేషాన్ని బయటపెట్టాయని మోదీ చెప్పారు.
గతంలో తన సమస్యల పరిష్కారం కోసం భారత్ ఇతరులపైన ఆధారపడేదని, నేడు భారతే ఇతర సమస్యలను పరిష్కరిస్తోందన్నారు. నేడు భారత్ జీ20 దేశాలకు నాయకత్వం వహిస్తోందని మోదీ చెప్పారు. ఇది కొంతమందికి కంటగింపుగా ఉండొచ్చని, తనకైతే గర్వంగా ఉందని ప్రధాని చెప్పారు. నిరాశలో ఉన్న కొందరు దేశ ప్రగతిని అంగీకరించలేకపోతున్నారని పరోక్షంగా కాంగ్రెస్ ని ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
2004 నుంచి 14 వరకూ భారత్ చాలా నష్టపోయిందని, అదో అవినీతి దశాబ్దమని ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. ఆ సందర్భాన దేశంలో అవినీతి రాజ్యమేలిందని, ఎన్నో భారీ స్కాంలు జరిగాయని విమర్శించారు. ఆ దశాబ్దం అవినీతి దశాబ్దమని అభివర్ణించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉగ్రవాదం రాజ్యమేలిందని చెప్పారు. ఆ దశాబ్ద కాలం దేశంలో రక్తపుటేరులు పారాయని విమర్శించారు.
తమకు ఎన్నికలే జీవితం కాదని..140 కోట్ల ప్రజల సంక్షేమమే తమకు ముఖ్యమన్నారు. కొవిడ్ ను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొందని చెప్పారు. చాలా దేశాలను నిరుద్యోగం, ద్రవ్యోల్భణం వేదిస్తున్నాయని ఇలాంటి సమయంలోనూ మనం ప్రపంచలోనే ఐదో అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదిగామని హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ జీ20 సదస్సును నిర్వహించే స్థాయికి ఎదిగామని, ఇది తమకు ఆనందదాయకమని పేర్కొన్నారు.