కర్నాటకలోని శివమొగ్గలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శివమొగ్గలో హిందూ సంఘాలు కొన్ని పోస్టర్లు ఏర్పాటు చేశాయి. ఆ పోస్టర్లలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు వీర సావర్కర్ బొమ్మ కూడా వుంది. దీంతో కొన్ని వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆ ఫ్లెక్సీలను తొలగించే ప్రయత్నం చేశాయి. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. అంతేకాకుండా ఓ యువకుడిపై కత్తితో కూడా దాడి చేశారు. పరిస్థితి చేయి దాటడంతో శివమొగ్గలో 144 సెక్షన్ విధించారు.
ఈ ఘర్షణకు కారకులైన నలుగుర్ని అరెస్ట్ చేశామని కర్నాటక అడిషనల్ డీజీపీ అలోక్ కుమార్ ప్రకటించారు. నదీమ్, అబ్దుల్ రహమాన్, జబిహుల్లాను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. అయితే… జబిహుల్లా పారిపోవడానికి ప్రయత్నించాడని, అయినా పట్టుకున్నామని వెల్లడించారు. అంతేకాకుండా 2016 లో గణేశ్ ఉత్సవాల సందర్భంగా తలెత్తిన ఘర్షణల్లోనూ జబిహుల్లా పాత్ర వుందని డీజీ వెల్లడించారు. ఇక… ఈ నలుగురు ముస్లిం యువకులకు ఏ ఆర్గనైజేషన్ తోనైనా సంబంధాలున్నాయా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.