హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దక్కన్ మాల్ అగ్నిప్రమాద ఘటన మరువక ముందే సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇందులో 6 గురు దుర్మరణం పాలయ్యారు. మృతులంతా 20 నుంచి 24 ఏళ్లలోపు వారే. వారంతా ఐదో అంతస్తులోని కాల్ సెంటర్ సిబ్బంది. కాగా.. ఈ ఘటనలో 12 మంది సురక్షితంగా బయటపడ్డారు. గురువారం సాయంత్రం 6:30 గంటల నుంచి మంటలు అంటుకున్నాయి. మొత్తం 8 అంతస్తులుండగా… ఏడో అంతస్తులో షార్ట్ సర్క్యూట్ తో ఈ మంటలు ప్రారంభమయ్యాయి.
ఆ తర్వాత 4,5 అంతస్తులకు కూడా పాకాయి. ఈ అంతస్తుల్లో బట్టల దుకాణాలు, కంప్యూటర్ దుకాణాలు, కాల్ సెంటర్లు… ఇలా ఇదో వాణిజ్య సముదాయం కావడంతో అందరూ ఒక్కసారిగా బయటికి పరుగుదీశారు. మంటల్లో 15 మంది పైగా చిక్కుకుపోయారు .దీంతో వీరందర్నీ అగ్నిమాపక సిబ్బంది క్రేన్ల సాయంతో కాపాడారు. ఇందులో ఆరుగురిని మాత్రం అపస్మారక స్థితిలోకి బయటికి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రశాంత్, వెన్నెల, శివ, శ్రావణి, ప్రశాంత్, ప్రమీణ, త్రివేణి దుర్మరణం పాలయ్యారు. దాదాపు మూడు గంటలపాటు మంటలు తగ్గినట్టే తగ్గి మళ్లీ వ్యాపిస్తుండడంతో అప్రమత్తమైన అగ్నిమాపక అధికారులు.. అదనపు ఫైరింజన్లను రప్పించారు. మొత్తం 15 అగ్నిమాపక శకటాలను ఉపయోగించి మంటలను అదుపులోకి తెచ్చారు.