ప్రకాశం జిల్లా మైనంపాడు గ్రామ గుడిదేని సాయి తేజస్వి భరతనాట్య రంగప్రవేశం సింగపూర్ లో ఘనంగా జరిగింది. ప్రాచీన నాట్య కళలకు ప్రోత్సాహం కరువైన ఈ రోజుల్లో, ఈ తెలుగు తేజం ప్రదర్శించిన తీరు ఆద్యంతం బహు రమణీయంగా సాగింది.ఆగస్టు 13వ తేదీన సింగపూర్ లోని నేషనల్ యూనివర్సిటీ సాంస్కృతిక కేంద్రంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో సాయి తేజస్వి ప్రేక్షకులను తన నాట్యకౌశలంతో అలరించింది. ఐదేళ్ల వయస్సులో మొదలైన నాట్యటడుగులు ఇప్పుడు రంగప్రవేశం చేశాయి.
చెల్లెలు ఖ్యాతిశ్రీ ఆలపించిన గణేశ ప్రార్ధనా గీతం తో కార్యక్రమం మొదలు కాగా, విష్ణు ఆవాహనం తో నృత్యప్రదర్శన ప్రారంభమై, వర్ణం, పదం, అభంగ్, జావళి, థిల్లాన నాట్య అంశాలతో నృత్యప్రదర్శన అత్యంత ఆకర్షణీయంగా, కనులవిందుగా సాగింది. తన హావభావాలతో, నాట్య భంగిమలతో మూడు గంటలపాటు ప్రేక్షకులను ముగ్దులనుచేసింది. గురువు శ్రీలిజీ శ్రీధరన్ నృత్యాలకు సుందరంగా రూపకల్పన చేశారు.సాయి తేజస్వి ఎనిమిది ఏళ్ళ వయస్సులోనే అనేక అంతర్జాతీయ నృత్య కార్యక్రమాలలో విజేత గా అవార్డులు పొందగా, 2019 లో త్యాగయ్య టీవీ నిర్వహించిన కార్యక్రమంలో నాట్యశిరోమణి బిరుదు పొందింది.
గౌరవ అతిథిగా విచ్చేసిన పద్మశ్రీ గ్రహీత, కూచిపూడి గురువర్యులు శ్రీమతి పద్మజా రెడ్డి సాయితేజస్వి ని మెండు ప్రశంసలతో దీవించారు. తిలకించిన శాస్త్రీయ నాట్య కోవిదుల మన్నలను అందుకుంది. ప్రత్యేక అతిధులుగా సింగపూర్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ కోశాధికారి శ్రీ వెంకట్ పద్మనాధన్, కళాక్షేత్ర గురువర్యులు శ్రీమతి సీతారాజన్, ఆత్మీయ అతిధులుగావిదూషి డా.ఎమ్.ఎస్. శ్రీలక్ష్మి, శ్రీ సాంస్కృతిక కళాసారధి అధ్యక్షులు శ్రీ కవుటూరు రత్నకుమార్, సామాజిక కార్యకర్త శ్రీమతి సునీత రెడ్డి హాజరయి సాయి తేజస్వి కి దీవనెలతో అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని సాయి తేజస్వి తల్లిదండ్రులు గుడిదేని వీరభద్రయ్య, పావని నిర్వహించగా, నాయనమ్మ గుడిదేని గోవిందమ్మ కూడా హాజరై సాయి తేజస్వికి ఆశీస్సులు అందించారు.500 మందికి పైగా పాల్గొని హృద్యంగా సాగిన ఈ కార్యక్రమం బహు జనరంజకం, భావితరానికి స్ఫూర్తిదాయకం, భరత కళలకు గర్వకారణం.