ఢిల్లీ మేయర్ ఎన్నికపై రగడ ముగిసింది. మొత్తానికి కొత్త మేయర్ కూడా వచ్చారు. అయితే… ఆసక్తికర పరిణామం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కౌన్సిలర్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. బీజేపీలో చేరారు. పవన్ షెహ్రావత్ అనే నేత ఢిల్లీలోని బవానా వార్డు కౌన్సిలర్ గా గెలిచారు. సరిగ్గా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు ముందే ఆప్ ని వీడి, బీజేపీలో చేరారు. ఢిల్లీ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్వేదా, ప్రధాన కార్యదర్శి హర్ష్ మల్హోత్రా తదితరులు పవన్ కి బీజేపీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. ఆప్ లో తాను ఇమడలేనని, అందుకే పార్టీని వీడానని పవన్ ప్రకటించారు. కేజ్రీవాల్ ప్రభుత్వం అంతులేని అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. అలాగే ఎంసీడీ కార్యాలయంలో రచ్చ రచ్చ చేయాలని కౌన్సిలర్లకు సూచనలు కూడా వచ్చాయని సంచలన ప్రకటన చేశారు.
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తైనా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం మాత్రం గందరగోళం వీడలేదు. బుధవారం స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ప్రారంభించగా ఆప్, బీజేపీ సభ్యుల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఆమ్ ఆద్మీ కౌన్సిలర్లు ఓటింగ్ సమయంలో మొబైల్ ఫోన్లు వినియోగించారని, బ్యాలెట్ రహస్యంగా ఉంచాలనే నిబంధనను ఉల్లంఘించారని బీజేపీ కౌన్సిలర్లు ఆరోపించారు. మళ్లీ ఎన్నిక జరపాలని పట్టుబట్టారు. అంతేకాకుండా కౌన్సిలర్లు ఒకరినొకరు నెట్టేసుకున్నారు. చేతులతో కూడా కొట్టేసుకున్నారు. మొత్తం 15 సార్లు వాయిదా పడుతూ వచ్చింది. కౌన్సిలర్లను పోలింగ్ బూత్ లలోకి మొబైల్ ఫోన్లతో అనుమతించడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా… మేయర్ షెల్లి ఒబేరాయ్ ప్రక్రియను కొనసాగిస్తుండటంతో బీజేపీ నిరసన వ్యక్తం చేసింది.