హోరా హోరీగా సాగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ మెజారిటీ మార్క్ ను దాటేసింది. దీంతో గెలుపు ఖాయం చేసుకుంది. మొత్తం 250 వార్డుల్లో మెజారిటీ మార్క్ అయిన 126 ను దాటి… 129 స్థానాల్లో చీపురు విజయం సాధించింది. మొత్తం 129 స్థానాల్లో ఆప్ విజయ కేతనం ఎగరేయడంతో మేయర్ పీఠంపై ఆప్ కూర్చోనుంది. మెజారిటీ మార్క్‌ను దాటి ఆప్ విజయం దిశగా దూసుకుపోవడంతో ఫలితాలు అధికారికంగా వెలువడక ముందే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టేశారు. ఢిల్లీలోని ఆప్ కార్యాలయం వద్ద పెద్దఎత్తున కార్యకర్తలు నృత్యాలు చేస్తూ, కేజ్రీవాల్ నినాదాలు హోరెత్తించారు.
ఇక… ఈ ఎన్నికల్లో బీజేపీ 101 వార్డులను దక్కించుకుంది. మరో 5 చోట్ల ముందంజలో వుంది. అయితే… జైలు శిక్ష అనుభవిస్తున్న సత్యేంద్ర జైన్ ఇలాఖాలో బీజేపీ వార్డులను సొంతం చేసుకుంది. ఇక.. మూడు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. డిసెంబర్ 4 న 250 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఆప్ విజయం సాధిస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ మంగళవారమే ప్రకటించాయి. దానికి తగ్గట్లుగానే ఫలితాలు వచ్చాయి.
15 సంవత్సరాల బీజేపీ పాలనకు తెరదించుతూ ఆప్ అఖండ విజయం సాధించింది. స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. 1985 లో ఎంసీడీ ఏర్పాటైంది. అయితే.. కాంగ్రెస్ సీఎం షీలా దీక్షిత్ హయాంలో కార్పొరేషన్లుగా విభజించారు. వాటిని ఏకీకరణ చేస్తూ మళ్లీ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంసీడీగా పునరుద్ధరించిన తరువాత ఇదే మొదటి ఎన్నికలు కావడం గమనార్హం.
ఫలితాలపై హర్షం వ్యక్తం చేసిన ఆప్ నేతలు
మున్సిపల్ పోల్స్ లో ఆప్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించడంతో ఆప్ నేతలు మనీశ్ సిసోడియా, రాఘవ్ చద్దా హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీ ప్రజలు బీజేపీకి తగిన పాఠం చెప్పారని ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. డెవలప్ మెంట్ కోసం పనిచేసే వారికే ప్రజలు పట్టం కట్టారని పేర్కొన్నారు. కేజ్రీవాల్ ను అణచివేసేందుకు కేంద్రం ప్రయత్నించిందని, కానీ ప్రజలు తమ వైపే మొగ్గారని ఆనందం వ్యక్తం చేశారు. ఇక.. ఆప్ పై నమ్మకం వుంచిన ప్రజలకు డిప్యూటీ సీఎం సిసోడియా ధన్యవాదాలు ప్రకటించారు. మాకు విజయం మాత్రమే కాదని, పెద్ద బాధ్యత అని సిసోడియా పేర్కొన్నారు.