ఢిల్లీ లిక్కర్ స్కాంలో డిప్యూటీ సీఎం సిసోడియా అరెస్ట్ తో ఆమ్ ఆద్మీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. తమ మంత్రి పదవులకు మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆమోదించారు కూడా. ఈ పరిణామాలు చాలా వేగంగా జరిగిపోవడం గమనార్హం. ఢిల్లీ మద్యం అవినీతి కుంభకోణంలో సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయగా… మనీలాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్ ఇప్పటికే అరెస్టై… జైలులో వున్నారు.
ఒక్క సిసోడియానే కేజ్రీవాల్ కేబినెట్ లో మొత్తం 18 శాఖలను నిర్వహిస్తుండటం గమనార్హం. ఇక.. సత్యేంద్ర జైన్ కీలకమైన ఆరోగ్య శాఖను చూసుకుంటున్నారు. మనీలాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్ అరెస్ట్ కావడంతో ఆయన శాఖను కూడా ఇప్పుడు సిసోడియానే చూసుకుంటున్నారు. మరోవైపు వీరిద్దరూ కేజ్రీవాల్ కేబినెట్ లో గానీ, అటు ఆమ్ ఆద్మీలో గానీ కీలకంగా వుంటూ వస్తున్నారు. నెంబర్ 2, నెంబర్ 3 స్థానంలో కొనసాగుతున్నారు. వీరిద్దరూ రాజీనామా చేయడంతో అతి త్వరలోనే సీఎం కేజ్రీవాల్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నారు.
మద్యం పాలసీలో అరెస్టైన డిప్యూటీ సీఎం సిసోడియాకు సుప్రీంలో చుక్కెదురైంది. సీబీఐ అరెస్ట్ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. సీబీఐ అరెస్టును సవాల్ చేయాలనుకుంటే ఢిల్లీ హైకోర్టుకు వెళ్లొచ్చని సూచించింది. సిసోడియా బెయిల్ పిటిషన్ ను స్వీకరించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఢిల్లీలో వున్నంత మాత్రాన సుప్రీం కోర్టును ఆశ్రయించడం సరికాదని, హైకోర్టుకు వెళ్లండని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.సీబీఐ ఛార్జిషీట్ లో సిసోడియా పేరు లేకున్నా… ఆయన్ను అరెస్ట్ చేయడం అక్రమమని సిసోడియా తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదించారు. దర్యాప్తుకు సహకరించడం లేదని సీబీఐ చేస్తున్న ఆరోపణలు కేవలం సాకుమ మాత్రమే అని పేర్కొన్నారు.