హోరాహోరీగా సాగిన ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ ఘన విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాపై 34 ఓట్ల తేడాతో ఆప్ మేయర్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ గెలుపొందారు. మొత్తం 266 ఓట్లు పోల్ కాగా… ఆప్ అభ్యర్థి షెల్లీకి 150 ఓట్లు రాగా, రేఖా గుప్తాకి 116 ఓట్లు వచ్చాయి. మేయర్ ఎన్నికల్లో గెలుపొందడంతో ఆప్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. బుధవారం మధ్యాహ్నం 11.30 గంటలకు ఎంసీడీ సమావేశమైంది. మేయర్, డిప్యూటీ మేయర్, ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యులకు ఎన్నిక జరగాల్సి ఉండగా, సభా కార్యక్రమాలకు మూడు సార్లు అవాంతరాలు తలెత్తాయి. అనంతరం కీలకమైన మేయర్ పదవికి ఓటింగ్ జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎంసీడీ ఎన్నికల పోలింగ్ బుధవారం జరిగింది.
షెల్లీ ఒబెరాయ్ ఢిల్లీ యూనివర్సిటీ (DU)లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఆమె ఇండియన్ కామర్స్ అసోసియేషన్ (ICA) జీవితకాల సభ్యురాలు కూడా. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ నుండి ఒబెరాయ్ పీహెచ్‌డీ చేశారు. ఐసీఏ కాన్ఫరెన్స్ నుంచి గోల్డ్ మెడల్‌ను అందుకున్నారు. పలు దేశీయ,అంతర్జాతీయ సదస్సుల నుంచి ప్రశంసలు సైతం దక్కించుకున్నారు.
గతేడాది డిసెంబర్ లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగ్గా… ఆప్ విజయం సాధించింది. మొత్తం 250 వార్డుల్లో ఆప్ 126 సీట్లు సాధించి, మెజారిటీ మార్క్ దాటి, ఘన విజయం సాధించింది. మొత్తం 134 సీట్లను ఆప్ కైవసం చేసుకుంది. అయితే… ఎల్జీ వీకే సక్సేనా నియమించిన 10 మంది నామినేటెడ్ కౌన్సిలర్లతో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయించడంతో అసలు వివాదం మొదలైంది. దీనిని ఆప్ తీవ్రంగా వ్యతిరేకించింది. నామినేట్ సభ్యులను ఓటింగ్‌కు ఎల్జీ అనుమతించాన్ని ఆప్ వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగడం, ఆప్-బీజేపీ మధ్య ఘర్షణ వాతావారణం తలెత్తడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఏకంగా 3 సార్లు మేయర్ ఎన్నిక వాయిదా పడుతూ వచ్చింది.
అయితే… దీనిపై ఆప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మేయర్ ఎన్నికను బీజేపీ అడ్డుకుంటోందంటూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీం విచారణ చేపట్టింది. అయితే… మేయర్ ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యులు ఓటు వేయవద్దని తీర్పునిచ్చింది. అంతేకాకుండా 24 గంటల్లోగా కార్పొరేషన్ సమావేశానికి నోటీసులు జారీ చేయాలని కూడా ఆదేశించింది. సుప్రీం తీర్పుతో ఎల్జీ వీకే సక్సేనా కార్పొరేషన్ సమావేశానికి అనుమతించారు.