Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఆగస్ట్ 9 నుండి రవీంద్రభారతిలో ‘అభినయ బహుభాషా నాటకోత్సవాలు’ !

అభినయ థియేటర్ ట్రస్ట్ గత 20 సంవత్సరాలుగా తెలుగు నాటకరంగంలో విశేష సేవలందిస్తున్న సంస్థ. బహుభాషా నాటకోత్సవాల నిర్వహణలో భారతదేశంలో ఉన్న అతికొద్ది నాటక సంస్థలలో అభినయ థియేటర్ ట్రస్టు ముందు వరుసలో ఉంది. గత 8 ఏళ్లుగా తెలంగాణ భాషా మరియు సాంస్కృతిక శాఖ, అభినయ థియేటర్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అభినయ నేషనల్ థియేటర్ ఫెస్టివల్ పేరిట హైదరాబాద్ రవీంద్రభారతిలో దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉండే అత్యుత్తమ నాటకాలను ఎంపిక చేస్తూ ఆ నాటకాలను ఇక్కడ ప్రదర్శించి నాటకరంగంలో వస్తున్న నూతన పోకడలను పరస్పరం తెలుసుకునే విధంగా బహుభాషా నాటకోత్సవాలను నిర్వహిస్తుంది.
ఈ సంవత్సరం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖతో కలిసి ఆగస్ట్ 9 వతేదీ నుండి 12వతేది వరకు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరగనున్న 16వ అభినయ నేషనల్ థియేటర్ ఫెస్టివల్-2022 75సంవత్సరాల భారత స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా అజాది కా అమ్రిత్ మహోత్సవ్ పేరిట జరుగనుంది. ఈ సంవత్సరం బహు భాషా నాటకోత్సవానికి ఎంట్రీలుగా CDలు,పెన్ డ్రైవ్ ల రూపంలో 114 నాటకాలు రాగా అందులో నుండి 7 భాషల నుండి 7నాటకాలను ఎంపిక చేయడం జరిగింది. ఇందులో కర్ణాటక నుండి కన్నడ నాటకం, బెంగాల్ నుండి బెంగాలీ నాటకం, మణిపూర్ నుంచి మణిపురి నాటకం, కేరళ నుంచి మళయాళం నాటకం, మహారాష్ట్ర నుంచి మరాఠీ నాటకం, సికింద్రాబాద్ నుంచి బహుభాషా నాటకం, తెలంగాణ రంగారెడ్డి జిల్లా నుండి ప్రత్యేక ప్రదర్శనగా తెలుగు నాటిక, ఇలా వివిధ ప్రాంతాల నుండి మొత్తం ఏడు నాటకాలను ఈ ఉత్సవంలో ప్రదర్శించనున్నారు. ఈ ఉత్సవాలను మీరందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం “అని అన్నారు తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషనర్,అభినయ థియేటర్ ట్రస్ట్ ప్రధాన సలహాదారులు సి.పార్థసారథి IAS గారు. ఈ రోజు తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఫెస్టివల్ బాహుభాషా నాటకాల వివరాలను వెల్లడించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అభినయ థియేటర్ ట్రస్ట్ అధ్యక్షులు అభినయ శ్రీనివాస్, ట్రస్టీ క్రోసూరి సుబ్బారావు పాల్గొన్నారు.
నాటకాల వివరాలు
తెలంగాణ ప్రభుత్వం భాషా మరియు సాంస్కృతిక శాఖ అభినయ థియేటర్ ట్రస్ట్ సమర్పించు అభినయ నేషనల్ థియేటర్ ఫెస్టివల్- 2022
అజాది కా అమ్రిత్ మహోత్సవ్ ప్రతిష్టాత్మకమైన 16వ బహుభాషా నాటకోత్సవం 2022 ఆగస్టు 9 నుండి 12 వరకు వేదిక: రవీంద్ర భారతి, హైదరాబాద్, తెలంగాణ మొత్తం వచ్చిన నాటకాల ఎంట్రీలు: 114 ఎంపికైన నాటకాలు: 06.
1. రూపాంతర, బెంగళూరు, కర్ణాటక
చోమన డుడి
కన్నడ నాటకం
కథ: డా.శివరామ కరంత్
నాటక రచయిత: ఆర్.నగేష్
దర్శకత్వం: KSDL చంద్రు
2.రంగస్థల విభాగం, శ్రీ శంకరాచార్య సంస్కృత విశ్వవిద్యాలయం, కలడి, కేరళ
ఊరుభంగం
మళయాళం నాటకం
దర్శకత్వం: డా. ఎన్. శిబిజ
3.భారతీయ క్రీడా శిక్షణ్ నాట్య మండల్, సోలాపూర్ , మహారాష్ట్ర
యా భూతంనౌ యా
మరాఠీ నాటకం
రచయిత: ప్రహ్లాద్ జాదవ్
దర్శకత్వం: రణధీర్ అభ్యంకర్
4.మీడియా థియేటర్ ఇన్‌స్టిట్యూట్, ఇంఫాల్, మణిపూర్
ఓం శాంతి
మణిపురి నాటకం
దర్శకత్వం: KBK శర్మ
5.శూద్రక, సికింద్రాబాద్, తెలంగాణ
ఓకా అనోఖా రూప్‌కథా చాలక్ సర్కిల్
బహుభాషా నాటకం
నాటక రచయిత: బెర్టోల్ట్ బ్రెచ్ట్
అనుసరణ & దర్శకత్వం: స్వపన్ మండల్
6.బరానగర్ భూమిసుతో థియేటర్, నార్త్ 24 పర్గనాస్ , పశ్చిమ బెంగాల్
చార్జాపోడ్ ఎర్ కోబి
బెంగాలీ నాటకం
నాటక రచయిత: జుల్ఫికర్ జిన్నా
దర్శకత్వం: స్వప్నదీప్ సేన్‌గుప్తా
7.అభినయ థియేటర్ ట్రస్ట్, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ
అమృత గరళం
(ప్రత్యేక ప్రదర్శన)
తెలుగు నాటిక
నాటక రచయిత: కాళహస్త్రి నాగరాజు
దర్శకత్వం: మంజునాథ
ఇది అభినయ యొక్క 64వ నాటకోత్సవం.

Related Posts

Latest News Updates